ఓటర్లపై జేసీ దివాకర్‌రెడ్డి బూతుపురాణం

1 Apr, 2019 11:03 IST|Sakshi

నీళ్లడిగిన సామాన్యుడిపై ప్రతాపం

ప్రశ్నించిన వ్యక్తిపై టీడీపీ కార్యకర్తల దాడి

సాక్షి, అనంతపురం : ఈ సారి ఎన్నికల్లో తనయుడు పవన్‌కుమార్‌ రెడ్డిని పోటీలో దింపిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రచారంలో హామీలు గుప్పించడమే కాదు.. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తున్నారు. ఆదివారం తాగునీటి సమస్యపై ఓ సామాన్యుడు ప్రశ్నించగా.. అసహనంతో రగిలిపోయారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కార్యకర్తలతో దాడి చేయించారు. ఆదివారం జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ శింగనమల అభ్యర్థి శ్రావణశ్రీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్లూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పుట్లూరులో తమకు ఎప్పుడూ మెజార్టీ రాలేదన్నారు. తమకు మెజార్టీ ఇస్తేనే చెరువులకు నీరు నింపుతామని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే యామినీబాల అవినీతికి పాల్పడిందని, అందుకే కొత్త అభ్యర్థిని తెచ్చామన్నారు. సభ చివర్లో.. సార్‌..మా గ్రామంలో తాగేందుకు నీళ్లు లేవు అని  వడ్డెర కాలనీకి చెందిన వెంకటనారాయణ ఎంపీ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీంతో ఎంపీ దివాకర్‌రెడ్డి అతన్ని అసభ్య పదజాలంతో దుషించారు. ‘తాగి వచ్చి మాట్లాడుతున్నావ్‌.. నీకు ఎవరు తాపి పంపారు’ అని మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు వెంకటనారాయణపై మూకుమ్మడి దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడ్డాడు. 

ఓటమి భయంతోనే జేసీ బెదిరింపులు : రాఘవరెడ్డి
నీటి సమస్యలపై ప్రశ్నించిన వెంకటనారాయణపై జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ నేత రాఘవరెడ్డి ఖండించారు. ఓటర్లను బెదిరించడం తగదన్నారు. మహిళల సమక్షంలో వెంకటనారాయణను బూతులు తిట్టడం దారుణమన్నారు. జేసీ సభ్యతా-సంస్కారం నేర్చుకోవాలని సూచించారు. ఓటమి భయంతోనే జేసీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను బెదిరించిన జేసీ దివాకర్‌పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు