జేడీఎస్‌కు ఆర్థికం, కాంగ్రెస్‌కు హోం!

1 Jun, 2018 03:09 IST|Sakshi

కర్ణాటక మంత్రివర్గంపై ఢిల్లీలో ముగిసిన ఇరుపక్షాల చర్చలు

న్యూఢిల్లీ/బెంగళూరు: కన్నడనాట మంత్రి పదవుల పంపిణీ ఓ కొలిక్కివచ్చింది. జేడీఎస్, కాంగ్రెస్‌ సంకీర్ణం ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రి  పదవి జేడీఎస్‌కు, హోం శాఖ కాంగ్రెస్‌కు ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని ఆయా పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. రెండు పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో కొనసాగించిన పలు దఫాల చర్చల్లో పదవుల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై విదేశాల్లో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఇక్కడి నేతలతో ఫోన్‌లో మాట్లాడారని వెల్లడించాయి. పదవుల కేటాయింపు ఒప్పందం తుది దశలో ఉందని తెలుస్తోంది. 

అయితే, తుది నిర్ణయం తీసుకోబోయే ముందు కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, జేడీఎస్‌ ప్రధాన కార్యదర్శి డానిష్‌ అలీ బెంగళూరు వెళ్లి తమ పార్టీ నేతలతో మాట్లాడతారని సమాచారం. ‘ మా పార్టీకి ఆర్థిక శాఖ ఇవ్వాలని అంగీకారం కుదిరింది. దీనిపై బెంగళూరు వెళ్లి సీఎంతోపాటు పార్టీ అధినేత దేవెగౌడతో మాట్లాడి ఖరారు చేస్తాం’ అని జేడీఎస్‌ నేత డానిష్‌ అలీ తెలిపారు. మే 23వ తేదీన జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి సీఎంగా, కాంగ్రెస్‌ నేత పరమేశ్వర డెప్యూటీ సీఎంగా ప్రమాణంచేశాక కీలక మంత్రిత్వశాఖలపై రెండు పార్టీలు పట్టుబట్టాయి.

నేడు ప్రకటిస్తాం: సీఎం
కేబినెట్‌ విస్తరణ, మంత్రి పదవుల కేటాయింపుపై శుక్రవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని  సీఎం కుమారస్వామి చెప్పారు. ‘నాతో పాటు జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ఢిల్లీలో జరిగిన పరిణామాలపై చర్చలు జరిపి, అంతిమ నిర్ణయం శుక్రవారం ప్రకటిస్తాం’అని చెప్పారు. ఆర్థిక శాఖ విషయమై ఇబ్బందుల్లేవని, అంగీకారానికి వచ్చామని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు