రిసార్ట్స్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేల యోగాసనాలు

10 Jul, 2019 18:56 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ చిక్కుల్లో పడటంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బెంగళూర్‌ నగరం వెలుపల తాము బసచేసిన గోల్ఫ్‌ రిసార్ట్‌లో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ రిసార్ట్‌లో రోజుకు రూ 15,000 వసూలు చేస్తారు. బెంగళూర్‌ సమీపంలోని గోల్ఫ్‌షైర్‌ క్లబ్‌లో సంకీర్ణ సర్కార్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేస్తుండగా మరికొన్ని రోజులు ఇదే రిసార్ట్స్‌లో సేదతీరాలని వారిని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కోరినట్టు సమాచారం.

ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్స్‌లో పలు యోగాసనాలు వేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. టీ షర్ట్స్‌, ట్రాక్‌ ప్యాంట్లు ధరించిన ఎమ్మెల్యేలు రిలాక్స్‌ అయ్యేందుకు శిక్షకుడి సాయంతో యోగసనాలు వేస్తున్నారు. తమ ఎమ్మెల్యేల కోసం బెంగళూర్‌ వెలుపల మడికెరిలో పడింగ్టన్‌ రిసార్ట్‌లో జేడీఎస్‌ నాయకత్వం సోమవారం నాడు మూడు రోజుల పాటు విడిది చేసేందుకు 10 విల్లాలు, 15 డీలక్స్‌ రూమ్‌లు, 10 కాటేజ్‌లను బుక్‌ చేసింది. మరోవైపు ముంబైలోని సోఫిటెల్‌ హోటల్‌లో బసచేసిన పాలక సంకీర్ణానికి చెందిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు తాజాగా హోటల్‌ రినైసెన్స్‌కు తమ విడిదిని మార్చారు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సంకీర్ణ సర్కార్‌ అన్ని చర్యలూ చేపడుతుంటే సంకీర్ణ సర్కార్‌ మెజారిటీ కోల్పోయిన క్రమంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు