మాజీ ప్రధానితో కేసీఆర్‌ కీలక భేటీ

1 Jul, 2018 13:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు విచ్చేసిన దేవేగౌడ ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు, జాతీయ రాజకీయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త కూటమి ఏర్పాటులో సహకారం అందించాల్సిందిగా మాజీ ప్రధాని దేవేగౌడను కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా దేవేగౌడకు సీఎం కేసీఆర్‌ కాకతీయ కళాతోరణాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ సంతోష్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే తన ఎజెండాగా ఇటీవల బెంగళూరుకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, కర్ణాటక ప్రస్తుత సీఎం హెచ్‌డీ కుమారస్వామితో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలతో వేదికను పంచుకోవడం ఇష్టం లేని కారణంగా సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఒకరోజు ముందుగానే వెళ్లి ఆయనకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌తోనూ కేసీఆర్‌ భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు