బీజేపీతో జేడీయూ కటీఫ్‌?

17 Jun, 2019 04:27 IST|Sakshi

ఎన్నికల తర్వాత మారిన నితీశ్‌ వైఖరి

స్పందించని కమలనాథులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి బీజేపీ, జేడీయూ విషయంలో మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో కలిసి పోటీ చేసిన జేడీయూ, బీజేపీ మెజారిటీ సీట్లు సాధించాయి. ఇదే మైత్రి ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా మారిన నితీశ్‌ వైఖరి ఎన్‌డీయేకు గుడ్‌బై చెప్పేందుకేనా అన్నట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర కేబినెట్‌ ఏర్పాటు నుంచి..
 రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ మంత్రివర్గంలో జేడీయూకు ఒక్క మంత్రి పదవినే ఇవ్వజూపడం నుంచి నితీశ్‌కు అసంతృప్తి మొదలైంది. అనంతరం రాష్ట్ర కేబినెట్‌ విస్తరించిన సీఎం నితీశ్‌ బీజేపీకి కూడా ఒకే ఒక్క మంత్రిపదవి ఇవ్వజూపారు. అదేవిధంగా, తగిన మార్పులు చేయకుంటే ట్రిపుల్‌ తలాక్, ఉమ్మడి పౌరసత్వ బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటామని నితీశ్‌ అంటున్నారు. 370వ అధికరణ, రామాలయ నిర్మాణం వంటి అంశాల్లోనూ ఎన్‌డీయే వైఖరికి భిన్నంగా నితీశ్‌ మాట్లాడుతున్నారు. బీజేపీతో తమ మైత్రి కేవలం బిహార్‌కే పరిమితమని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతామని జేడీయూ నేతలు అంటున్నారు. ఎన్నికల విశ్లేషకుడు, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతతో కలిసి పని చేస్తామని ప్రకటించడమూ బీజేపీని ఇరుకున పెట్టడానికేనంటున్నారు.  

గొడవల్లేవంటున్న జేడీయూ: ఇటీవల ఆర్‌జేడీ అధినేత లాలూ ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో నితీశ్‌ పాల్గొనడంపై బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను జేడీయూ తప్పుపడుతోంది. బీజేపీయే గిరిరాజ్‌తో ఈ పని చేయించిందంటోంది. అయితే, కమలనాథులతో విభేదాల్లేవని జేడీయూ అంటోంది. కీలక అంశాలపై ఎన్‌డీయే పక్షాల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెబుతున్నామే తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదంటోంది. బీజేపీతో సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని నితీశ్‌ అంటున్నారు.

సొంత ప్రయోజనాలే ముఖ్యం
నితీశ్‌కు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, దానికోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు వెనుకాడరని విశ్లేషకులు అంటున్నారు. 2005లో బీజేపీతో కలిసి ఆయన బిహార్‌లో లాలూ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కొంతకాలం బీజేపీతో ఆయన స్నేహం నడిచింది. అనంతరం ఎన్‌డీయేను వీడి 2014 లోక్‌సభ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తలపడ్డారు. 2017లో తిరిగి ఎన్‌డీయే గూటికి చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి రాష్ట్రంలో ఉన్న 40 సీట్లలో 39 సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో బిహార్‌ శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్పటి దాకా వారి మైత్రి కొనసాగేది అనుమానమేనని  విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ నాయకత్వం నుంచి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు