జేడీయూ నేత హత్య కేసులో షాకింగ్ వాస్తవాలు

14 Oct, 2017 13:48 IST|Sakshi

సాక్షి : మావోయిస్ట్ కొమాండర్‌ కుందన్‌ పహన్‌ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులో ఉన్న విషయం తెలిసిందే. జనతా దళ్‌ యునైటెడ్‌ నేత, జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండా హత్య కేసులో కుందన్‌ అరెస్టై జైల్లో ఉన్నాడు. ఈ మేరకు ఎన్‌ఐఏ చేపట్టిన విచారణలో సంచలన వాస్తవాలను వెల్లడించాడు. 

రమేష్ సింగ్ హత్య కోసం మాజీ మంత్రి రాజా పీటర్‌ వద్ద నుంచి  రూ.5 కోట్లకు సుపారీ తీసుకున్నట్లు కుందన్‌ వెల్లడించాడు. ఈ హత్యకు గాను పీటర్ తొలుత రూ.3 కోట్లు కుందన్‌కు అడ్వాన్స్‌గా చెల్లించాడు.  మిగతా రూ. రెండు కోట్లను హత్య అనంతరం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ డబ్బు మావోయిస్ట్ పొలిట్‌బ్యూరోకు చేరకముందే.. మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు వాటిని తీసుకుని పరారయ్యాడు. 

చివరకు బలరామ్‌ పోలీసులకు చిక్కటంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. మరో మాజీ అయిన గోపాల కృష్ణ పటార్‌ అలియాస్ రాజా పీటర్‌ను నాలుగు రోజుల క్రితం ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజా పీటర్‌కు అంత పెద్దమొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు సమకూర్చారు? అన్న విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు జైల్లో ఉన్న మాజీ మావోయిస్టులను కూడా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

2008 జూలై లో రాంచిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా.. మావోయిస్ట్ గెరిల్లా దళం దాడి చేసి రమేష్‌ ను కాల్చి చంపింది. బాడీ గార్డు శేష్‌నాథ్ సింగే మావోలకు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం ఎన్‌ఐఏ రిమాండ్ లో ఉన్న రాజా పీటర్ అలియాస్‌ గోపాల కృష్ణ పటార్‌ 2009 తమర్‌ నియోజవర్గ ఉప ఎన్నికలో సంచలనం సృష్టించారు. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌ను రాజా పీటర్ ఓడించి చరిత్ర సృష్టించాడు. సీఎం ఓడిపోవటంతోనే అప్పుడు జార్ఖండ్‌లో రాష్టపతి పాలన విధించాల్సి వచ్చింది కూడా.

మరిన్ని వార్తలు