బీజేపీ-జేడీయూ పొత్తుపై స్పందించిన నితీశ్‌

10 Jun, 2019 16:01 IST|Sakshi

గతంలోలాగే తమ బంధం బలంగా ఉందని వ్యాఖ్య

బిహార్‌ తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీతో పొత్తు ఉండంటున్న జేడీయూ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు వచ్చినట్టు కథనాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ జేడీయూ మోదీ మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించింది. అంతేకాకుండా బిహార్‌ మినహాయించి మిగతా రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమిలో తాము ఉండబోమంటూ జేడీయూ ఆదివారం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో జేడీయూ-బీజేపీ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయన్న కథనాలపై జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ స్పందించారు. గతంలో మాదిరిగానే బీజేపీతో తమ పొత్తు బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీతో ఎలాంటి విభేదాలు లేవు. గతంలో మాదిరిగానే బీజేపీతో మా బంధం బలంగా ఉంది. బిహార్‌లోనూ, ఎన్డీయేలోనూ అంతా బాగుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రెండో పర్యాయం ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మే 30వ తేదీన ప్రధాని మోదీ తన నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశారు.అయితే, మోదీ కేబినెట్‌లో చేరేందుకు జేడీయూ నిరాకరించింది. తమకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పిందని, ఒక్క బెర్త్‌ అంటే కేవలం నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమేనని, అందుకే కేంద్రమంత్రిమండలిలో చేరడం లేదని నితీశ్‌ తేల్చిచెప్పారు. బిహార్‌లో 17 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 16 స్థానాల్లో గెలుపొందింది.

మరిన్ని వార్తలు