ప్రభుత్వానిది కాలయాపనే

10 Nov, 2017 01:57 IST|Sakshi

ముస్లిం రిజర్వేషన్లపై టి.జీవన్‌రెడ్డి

ప్రకటనలే తప్ప కార్యాచరణ లేదని విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: మైనారిటీల సంక్షేమం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని, మైనారిటీ రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందంటూ కాలయాపన చేస్తోందే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించట్లేదని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మైనారిటీల సంక్షేమంపై గురువారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కోర్టుకెళ్లేందుకు మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. ‘‘12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడంతో ఆ వర్గం ప్రజల్లో ఆశలు మొలకెత్తాయి.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కమిషన్‌ వేసేందుకు 10 నెలలు పట్టింది. దాని నివేదిక ఇవ్వడానికి 20 నెలలు పట్టింది. ఇప్పుడు కేంద్రానికి పంపామంటున్నారు. అది పంపి కూడా ఆరు నెలలవుతోంది. ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తాయి. ఈలోగా మీరు మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారో చెప్పాలి’’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి నిలదీశారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు టీఆర్‌ఎస్‌ సమర్థించిందని, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ హరించిందని, కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా మైనారిటీ రిజర్వేషన్లపై కేంద్రం ఎందుకు సానుకూలంగా స్పందించట్లేదని  ప్రశ్నించారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదని, మైనారిటీలకు ఇప్పుడున్న 4 శాతం రిజర్వేషన్లకు మరో 6 శాతం కలిపి మొత్తం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ కమిషన్‌ ప్రతిపాదించగా ప్రభుత్వం ఇచ్చిన నోట్‌లో మాత్రం బీసీ కమిషన్‌ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేసిందని పేర్కొన్నదని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి అంశాలు కోర్టులో ఎలా నిలబడతాయని ఆయన ప్రశ్నించారు.

మైనారిటీ రిజర్వేషన్లతోపాటు ఎస్సీ, ఎస్టీల అంశంపైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రంలో రిజర్వేషన్‌ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. మైనారిటీలకు బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లోని డబుల్‌ బెడ్రూం ఇళ్లలో 25 శాతం ముస్లింలకు రిజర్వేషన్‌ ఇవ్వాలని కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా