పవన్‌కు బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ: రాజశేఖర్‌

5 Apr, 2019 14:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఓటు అనే ఆయుధాన్ని సరైన విధంగా వాడాలని వైఎస్సార్‌ సీపీ నేత, సినీ నటుడు రాజశేఖర్‌ సూచించారు. శుక్రవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు, పేదల సంక్షేమాన్ని గురించి ఆలోచించారని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని ఆయన ప్రవేశపెట్టారని రాజశేఖర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మాదిరిగా సినిమాలు చేస్తూ..రాజకీయాలు మాట్లాడటం వైఎస్‌ జగన్ చేయలేదని.... ఎన్ని కష్టాలు వచ్చినా  ఆయన... జనంతోనే ఉన్నారన్నారు. 

పవన్‌కు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని, అయితే ఆయన సినిమాల నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్‌లా రాజకీయాల్లోకి రావాలని రాజశేఖర్‌ అన్నారు. స్థిరమైన వైఖరి లేని పవన్‌...ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ కంపెనీలకు ఏజెంట్‌గా మారారని రాజశేఖర్‌ ధ్వజమెత్తారు. 

సినీనటి జీవిత మాట్లాడుతూ వైఎస‍్సార్‌ తన పాలనలో గ్రామీణుల కష్టాలను గుర్తించి, సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చారన్నారు. మళ్లీ అటువంటి పాలన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 21వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని, వాటన్నింటిని రద్దు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ హామీని అటకెక్కించారని జీవిత మండిపడ్డారు. ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు ఓట్లకు గాలం వేస్తున్నారన్నారు. కాల్‌మనీ పేరుతో ఎందరో మహిళలపై టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారన్నారు. చివరికి నందమూరి లక్ష్మీపార్వతి గురించి చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు గమనించాలన్నారు. దీన్నిబట్టే మహిళల పట్ల చంద్రబాబుకు ఉన్న వైఖరి ఏంటో తేటతెల్లం అవుతుందన్నారు.

మరిన్ని వార్తలు