జిగ్నేష్‌ను చంపేందుకు వాట్సాప్‌లో చర్చ?

24 Feb, 2018 11:49 IST|Sakshi
జిగ్నేష్‌ మెవానీ (ఫైల్‌ ఫొటో)

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ పోలీస్‌ శాఖపై దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఎన్‌కౌంటర్‌లో చంపాడానికి గుజరాత్‌ పోలీసులు కుట్ర చేస్తున్నారని ట్వీట్‌ చేశారు. ఈ విషయం పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌ (ఏడీఆర్‌ అండ్‌ మీడియా)లో ఇద్దరి పెద్ద పోలీస్‌ అధికారుల మధ్య చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దానికి సంబంధించిన వెబ్‌ పోర్టల్‌ లింక్స్‌ను సైతం జత చేశారు. 

ఏడీఆర్‌ అండ్‌ పోలీస్‌ వాట్సాప్‌  గ్రూప్‌లో  రాష్ట్రానికి చెందిన సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్లతో పాటు మీడియా ప్రతినిధులున్నారు. ఇటీవల రెండు వీడియోలను అహ్మదాబాద్‌ డిప్యూటీ ఎస్పీ ఆర్‌బీ దేవ్‌దా ఈ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. ఓ వీడియోలో కొంతమంది పోలీసులు ఓ రాజకీయనాయుకున్ని చితక బాదుతుండగా.. మరో వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్లపై పోలీసులను ప్రశంసిస్తూ యూపీ సీఎం ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. అయితే ఈ వీడియోలకు ఆ సదరు డిప్యూటీ ఎస్పీ పోలీసులు పట్ల అనుచితంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుందని క్యాఫ్షన్‌ ఇచ్చాడు. 

ఇటీవల ఓ దళిత కార్యకర్త మరణంతో  మెవానీ అహ్మదాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసులకు మెవానీకి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆ అధికారి ఈ వీడియోలను పోస్ట్‌ చేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆ ఎస్పీ మాత్రం కేవలం ఆ వీడియోలు ఫార్వర్డ్‌ మెసేజ్‌లేనని, వాటిలో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మేవానీ గుజరాత్‌ హోంమంత్రి, హోం సెక్రటరీ, డీజీపీలపై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెవానీ
ఏప్రిల్‌లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు మెవానీ స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేకంగా జతకట్టే పార్టీలకు మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. దళితుల 20 ఓట్లు  కూడా బీజేపీకి పడకుండా కృషి చేస్తానని ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు