రోహిత్‌ వేముల తల్లికి విజ్ఞప్తి

18 Jan, 2018 10:30 IST|Sakshi

రాజేంద్ర నగర్‌ : దళిత యువ నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని.. రోహిత్‌ వేముల తల్లి రాధికకు ఓ విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆమెను కోరుతున్నాడు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పాలని జిగ్నేష్‌ ఆకాంక్షిస్తున్నాడు . 

‘‘దళిత పోరాటంలో మా అందరికీ ప్రేరణగా నిలుస్తున్న రాధికమ్మకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి. తద్వారా పార్లమెంట్‌లో ‘మను’స్మృతి ఇరానీకి గుణపాఠం నేర్పించాలి’’ అని జిగ్నేష్‌ ఈ ఉదయం తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశాడు. దళితులనే లక్ష్యంగా చేసుకుని వ్యవహరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీరుకు వ్యతిరేకంగా.. ఆమె పేరు ముందు మనుస్మృతిని చేర్చి అప్పట్లో  పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. 

రెండు సంవత్సరాల క్రితం  హైదరాబాద్‌ సెంట్రల్‌యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌ రెండో వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన జిగ్నేష్‌.. రాధికమ్మను కలిసి సంఘీభావం తెలిపాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాధిక పాల్గొంటారని.. బీజేపీ ఓటమినే తమ అంతిమ లక్ష్యమని జిగ్నేష్‌ ఈ సందర్భంలో వెల్లడించారు.  దళిత ఉద్యమం దేశంలోని ప్రతీమూలా విస్తరించాల్సిన అవసరం ఉందని..  దళిత వ్యతిరేక చర్యలకు మోదీ ప‍్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని జిగ్నేష్‌ వెల్లడించాడు. 

>
మరిన్ని వార్తలు