‘పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా చూడండి’

17 Jul, 2018 17:47 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి(పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్టు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత జితేందర్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ తరఫున ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బడ్జెట్‌ సమావేశాలు పూర్తిగా జరగలేదని గుర్తు చేశారు.  ఈ సమావేశాల్లోనైనా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌, ఐఐఎం వంటి సమస్యలపై సభలో చర్చ జరిగేలా చూడాలని కేంద్రానికి విన్నవించామన్నారు. 

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సమస్యలు ఉన్నందున.. అన్ని పార్టీల నేతలు కలిసి సమావేశాలు సజావుగా సాగేలా చూడాల్సిన అవసరముందన్నారు. టీడీపీ రెండు విషయాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు కోరిందని వెల్లడించారు. రాష్ట్ర విభజన హామీలపై తాము వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. అది చర్చకు వస్తే తాము కూడా తెలంగాణ అంశాలను లేవనెత్తుతామన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానికి కూడా మద్దతు అడిగిందని.. దానిపై తమ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు