కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు

13 Aug, 2019 13:13 IST|Sakshi

సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై ఎండీఎంకే చీఫ్, ఎంపీ వైగో (వి.గోపాలసామి) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి కశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘భారత్‌ వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే సమయానికి భారత్‌లో కశ్మీర్ భాగంగా ఉండదు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌పై బురద చల్లింది. గతంలో పాలించిన కాంగ్రెస్‌ పార్టీ కశ్మీర్‌కు 30 శాతం అన్యాయం చేస్తే.. బీజేపీ 70 శాతం చేసింది. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం ఇదే విధంగా చెప్పాను’అని అన్నారు.

కాగా కశ్మీర్‌ విభజన సందర్భంగా పార్లమెంట్‌లో వైగో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిందం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. కాగా డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి  సీఎన్ అన్నాదురై  110 జయంత్యుత్సవాలను తమ పార్టీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఈ వేడుకలను ప్రారంభిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు