కలకలం: నవీన్‌ దలాల్‌కు ఎమ్మెల్యే టికెట్‌

10 Oct, 2019 10:09 IST|Sakshi
నవీన్‌ దలాల్‌ (ఫేస్‌బుక్‌ ఫొటో)

బహదూర్‌ఘర్‌: గత ఏడాది జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌పై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న నవీన్‌ దలాల్‌ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన టిక్కెట్టుపై బహదూర్‌ఘర్‌ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. తనను తాను గోసంరక్షకుడినని చెప్పుకునే నవీన్‌ దలాల్‌.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే ఆవుపేరుతో రాజకీయాలు నెరపుతున్నారనీ వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్టు 13న ఢిల్లీలో మరొకరితో కలిసి ఉమర్‌ ఖలీద్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు నవీన్‌ యత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. బెయిల్‌పై బయటికి వచ్చిన నవీన్‌ ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. తానిప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కేసుతో పాటు మరో రెండు కేసులు తనపై ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొనడం గమనార్హం.

29 ఏళ్ల నవీన్‌ దలాల్‌ ఆరు నెలల క్రితం శివసేన పార్టీలో చేరారు. మిగతా పార్టీల కంటే శివసేన విధానాలు స్పష్టంగా ఉండటం వల్లే ఈ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. గత పదేళ్లుగా గోసంరక్షణ సహా పలు అంశాలపై తాను పోరాటం చేసినట్టు వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, వారంతా తనకు అండగా ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బహదూర్‌ఘర్‌లో సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే నరేశ్‌ కౌశిక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి రాజిందర్‌ సింగ్‌ జూన్‌, ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి నఫె సింగ్‌ రాథీ, మరో 20 మంది ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన నుంచి బరిలోకి దిగుతున్న నవీన్‌ దలాల్‌ ఏమేరకు పోటీ ఇస్తారో వేచిచూడాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు