బాబుకు ఈ ఏడాది ఏడుపుగొట్టు నామసంవత్సరం : జోగి రమేశ్‌

29 Dec, 2019 18:39 IST|Sakshi

సాక్షి,తాడేపల్లి : 2019 సంవత్సరం చంద్రబాబుకు ఏడుపుగొట్టు నామ సంవత్సరమని, ఆయనకు ఈ ఏడాది ఏడ్పులు, పెడబొబ్బలతోనే గడిచిందని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకనే నిత్యం ఏడుస్తున్నాడని తెలిపారు. సీఎం జగన్‌ శాసనసభలో చారిత్రక చాట్టాలను ప్రవేశపెడితే ఆయన సహించలేకపోతున్నారని అందుకే అసెంబ్లీ నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లేవారని పేర్కొన్నారు.

దిశ బిల్లు, మహిళ రిజర్వేషన్లు, బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అభినందించకుండా ఏడుస్తూ బయటకు వెళ్లిపోయింది నీవు కాదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్‌ 80 నుంచి 90 శాతం అమలు చేశారని అందులో రైతు భరోసా, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు ఉన్నాయని గుర్తు చేశారు.

మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తున్నామని, అలాగే పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువును అందజేస్తామంటే బాబు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 'రాజధాని ప్రాంతంలో పుట్టినవాడిగా చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్న.. గత ఐదేళ్ల కాలంలో సీఎంగా పనిచేసిన మీరు అమరావతికి ఏం చేశారో చెప్పండి'. ఈ ఐదేళ్లలో బాబు కేవలం తన మాటలతో అరచేతిలో స్వర్గం చూపించాడు తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు.

సుజనా చౌదరి పచ్చి మోసగాడు, ప్రజల దనాన్ని కొల్లగొట్టిన మాయగాడని జోగి రమేశ్‌ వెల్లడించారు. సుజనా చౌదరి పేరుకే బీజేపీ నాయకుడని కానీ పరోక్షంగా ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారని, అందుకే బాబు తన చిలుకపలుకులను సుజనా నోటి ద్వారా పలికిస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి వేలకోట్లు దొంగతనం చేసిన సుజనా చౌదరి లాంటి వ్యక్తికి వైఎస్‌ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్నారు.
(బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్‌ సాధ్యం కాదు : కొడాలి నాని)

మరిన్ని వార్తలు