ముగిసిన జోగి రమేశ్‌ విచారణ

6 Nov, 2018 19:21 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేశ్‌ విచారణ ముగిసింది. ఆయనను ఉదయం నుంచి దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన పోలీసులు.. మళ్లీ 15వ తేదీన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు రావాలని అన్నారు. వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేశ్‌కు పోలీసులు అక్రమంగా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే తనకు నోటీసులు పంపడంపై స్పందించిన జోగి రమేశ్‌.. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నోటీసులతో బయపెట్టాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపైనే కుట్రలు చేస్తున్నవారు ఎంతకైనా తెగిస్తారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. 

కాగా, నేడు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన రమేశ్‌కు మద్దతుగా భారీగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని తమ నిరసన తెలిపారు. అయితే వారితో పోలీసులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించారని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విచారణ అనంతరం అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. రమేశ్‌ను 15వ తేదీన మళ్లీ విచారణకు రావాల్సిందిగా కోరినట్టు తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా