మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది

11 Feb, 2018 11:43 IST|Sakshi
మాట్లాడుతున్న జోగి రమేష్‌

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్‌

ఇబ్రహీంపట్నం (మైలవరం) :  జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్‌ పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై  బనాయించిన అక్రమ కేసుల అంశంపై ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో ఏమిచేయాలో తోచక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందిపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఈ నెల 8న వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపు మేరకు ప్రశాంతంగా బంద్‌ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయింపజేసిన మంత్రి ఉమా, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

గత నెల 29న కూడా కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు నిర్వహించిన ‘వాక్‌ విత్‌ జగనన్న’ పాదయాత్రలో భారీ జనసందోహం పాల్గొనడంతో ఖంగుతిన్న మంత్రి ఆ రోజు నుంచే అక్రమ కేసులు బనాయించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నాడన్నారు. అనారోగ్యంతో మరణించిన ఓ వృద్ధుడి శవాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే పోస్టుమార్టానికి తరలించి పాదయాత్ర వల్ల  మరణించాడని చిత్రించేందుకు విఫలయత్నం చేశాడన్నాడు. రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. పోలీసులు న్యాయం వైపు నిలవాలని, లేకుంటే పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చినవారవుతారన్నారు.  అక్రమ కేసులను ప్రజాబలంతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు