‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్‌’

21 Jan, 2020 16:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వాఖ్యలపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్‌ చేసిన వ్యాఖ్యలకు పవన్‌కు‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్‌ కాదని పవన్‌ తెలుసుకోవాలన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని కూల్చేస్తామని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్‌, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ఉన్నారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా సీఎం జగన్‌ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. 

అమ్మ ఒడి పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని రమేష్‌ అన్నారు ఒక మంచి ఆలోచనతో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారని.. ఆయన నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్‌ ఉందా నిలదీశారు. తమ నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌కు అమరావతిలో నివాసం ఉందని అన్నారు. చంద్రబాబుకు అమరావతి, అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం పథకాలను విమర్శించే నైతిక హక్కు లేదని విమర్శించారు. అమరావతిని ఎక్కడికైనా తరలించారా అని చంద్రబాబును, టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.

అమ్మ ఒడి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం : వేణుగోపాల్‌
అమ్మ ఒడి పథకంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేదల జీవితాలకు వెలుగు తెచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువుకు సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయమని చెప్పారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. విద్యార్థులు, రైతులకు సత్వర ఫలితాలు ఇచ్చేలా.. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. రీజినల్‌ ఎకానమిక్‌ బోర్డులను పటిష్టం చేయాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు