హుజూర్‌నగర్‌లో ఉమ్మడి అభ్యర్థే

24 Sep, 2019 02:55 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న రాఘవులు. చిత్రంలో తమ్మినేని వీరభద్రం

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే పరిస్థితి లేదు: తమ్మినేని

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టీటీడీపీ, టీజేఎస్, కలిసొచ్చే ఇతర లౌకిక శక్తులను కలుపుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే పరిస్థితి లేదన్నారు. సోమవారం ఎంబీ భవన్‌లో పార్టీ నాయకులు బీవీరాఘవులు, చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. అసెంబ్లీలో వామపక్షాల గొంతు లేకపోవడంతో ప్రజల సమస్యలు ప్రస్తావించే పరిస్థితి లేకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతోందన్నారు. యురేనియం తవ్వకాలపై రాష్ట్ర బీజేపీ తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఆర్థికమాంద్యం తీవ్రమైన నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి రూ.1.65 లక్ష కోట్లు తీసుకున్న కేంద్రం.. రూ.1.40 లక్ష కోట్లను కార్పొరేట్‌ సంస్థలకు పన్నుల తగ్గింపు, ఇతర రాయితీలు కల్పించడం తిరోగమన చర్య అని బీవీ రాఘవులు అన్నారు. 

మరిన్ని వార్తలు