‘కోదండరాం పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారు’

10 Sep, 2018 14:17 IST|Sakshi
జోత్స్న (ఫైల్‌ ఫొటో)

టీజేఎస్‌ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

పార్టీలో మహిళలకు గౌరవం లేదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్‌)పై ఆ పార్టీ మహిళా నేత జోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముతున్నారని, పార్టీలోని సీనియర్‌ నేత కపిల్‌వాయి దిలీప్‌ కుమార్‌ ఈ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. టీజేఎస్‌ బిజినెస్‌ సెంటర్‌గా మారిపోయిందని, ఇది కోదండరాంకు తెలుసో.. తెలియదో అన్నారు. పార్టీలో వసూల్‌ రాజాలు ఎక్కువ మందే ఉన్నారని, దిలీప్‌ కుమార్‌ మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. చులకన భావంతో తనపై దాడిచేస్తున్నారని, సత్యం అనే వ్యక్తిని తనపై దాడికి దింపుతున్నారని బాధపడ్డారు. విశాల్‌ అనే వ్యక్తి తనకు, తన భర్తకు ఫోన్‌ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.(చదవండి: టీఆర్‌ఎస్‌ కారులో ‘పొగలు’)

ఏదైనా అడిగితే ఏమిస్తారని, కారు, బంగ్లా ఇస్తారా? అని ఎదరు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అంబర్‌పేట్‌ టికెట్‌ ఇవ్వనందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తూ పేపర్లలో రాయించారన్నారు. దిలీప్‌కుమార్‌కు పార్టీలో ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం కావడం లేదని, ఆడవాళ్లను మాత్రం అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం లక్ష్యాల దిశగా పార్టీ నడవట్లేదని, మనీ మిషన్‌గా నడుస్తుందన్నారు. దిలీప్‌ కుమార్‌కు తన రూ.2 లక్షలు ఇచ్చానని, అడిగితే పార్టీ ఫండ్‌ కింద తీసుకున్నామని దబాయిస్తున్నారని తెలిపారు.

చదవండి: ముందస్తు ఎన్నికల ముచ్చట్లు

మరిన్ని వార్తలు