కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలి

26 Jun, 2020 10:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ కుటుంబం ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు మళ్లించిందని,  కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలు ఇచ్చిన డబ్బులను వ్యక్తిగత ఫౌండేషన్‌కు ఎలా మళ్లిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘యూపీఏ హయాంలో నిధుల మళ్లింపు మోసం జరిగింది. ప్రజల డబ్బులను కుటుంబ సంస్థకు మళ్లించడం పెద్ద మోసం. సోనియా కుటుంబం ధనార్జన కోసం అధికారాన్ని వాడుకుంది. ఈ లూటీపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ( కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం! )


కాగా,  రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపు 90 లక్షల రూపాయలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్‌ పార్టీ వివరణ ఇవ్వాలని  గురువారం న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2005-06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అందినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ ఉంటే రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారని అన్నారు.

మరిన్ని వార్తలు