అంతా మీరే చేశారు!

25 Dec, 2018 02:04 IST|Sakshi

ఓటమికి రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలే కారణం

తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా?

బీజేపీ సమీక్షా సమావేశంలో అభ్యర్థుల మండిపాటు

రాష్ట్ర నాయకులు పట్టించుకోలేదని ఆవేదన

కొత్త వారికి నాయకత్వం ఇవ్వాలని డిమాండ్‌

ప్రధాని, అమిత్‌ షా వచ్చినా దారుణ ఫలితాలపై జేపీ నడ్డా సీరియస్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయానికి రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యతంటూ పార్టీ నేతలు ముక్తకంఠంతో విమర్శించారు. టికెట్లు ఇవ్వడంలో హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోలేదంటూ పార్టీ సమీక్షాసమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ముందు బీజేపీ ముఖ్యనేతలు, అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశం, పదాధికారుల భేటీ, పోటీచేసిన అభ్యర్థుల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మూడు భేటీల్లోనూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేందుకే హడావుడి చేశారు. తీరా టికెట్లు ఇచ్చాక పట్టించుకోలేదు. ఎలా ముందుకు వెళ్లాలో చెప్పలేదు. జాతీయ పార్టీ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనల విషయంలోనూ సరైన సమాచారం లేదు. సమన్వయం లేదు. కొన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నేతలెవరూ రాలేదు. అంతా గందరగోళమే. చివరకు బూత్‌ కమిటీలను కూడా బలోపేతం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల నేతలను అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కొత్తవారికి రాష్ట్రాల బాధ్యతలు అప్పజెప్పండి’అంటూ నడ్డా ముందు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రుల తీరుపై మండిపాటు
సోమవారం జరిగిన మూడు వేర్వేరు భేటీల్లోనూ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలపై జిల్లాల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కేంద్ర మంత్రులు వస్తారు. కేసీఆర్‌ను పొగిడి పోతారు. ఇటీవల వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ కూడా అదే చేసి వెళ్లారు. తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా? జాతీయ స్థాయిలో తెలంగాణ వారికి ప్రా«ధాన్యమే లేదు. ఎంపీ దత్తాత్రేయకు ఉన్న పదవిని కూడా తొలగించా రు. తెలంగాణలో పార్టీ బతకాలనుకుంటే.. ముందు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి’అని నేతలు, అభ్యర్థులు నిక్కచ్చిగా పేర్కొన్నట్లు సమాచారం. పదాధికారులు, అనంతరం అభ్యర్థుల సమావేశంలోనూ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ ఓటమికి కారణమైందని విమర్శించుకున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం తెలంగాణపై చిన్న చూపు చూస్తోందని, రాజ్యసభలో చోటు కల్పించక పోవడంతో పాటు ఉన్న ఏకైక కేంద్ర మంత్రిని తొలగించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నట్లు తెలిసింది. 

రాష్ట్ర నేతలపై నడ్డా సీరియస్‌
మరోవైపు.. కోర్‌ కమిటీ సమావేశంలోనూ ముఖ్యనేతలపై నడ్డా సీరియస్‌ అయినట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీతో పాటు 10 మందికి పైగా కేంద్ర మంత్రులు, నలుగురు వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్లను పెంచుకోవడం పక్కన పెడితే కనీసం ఉన్న స్థానాలను కాపాడుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కోర్‌ కమిటీ నేతలను నడ్డా ప్రశ్నించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్దామని జేపీ నడ్డా సూచించినట్లు తెలిసింది. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహించాలని సర్ది చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీతో కూటమి కట్టిన చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడమే.. కేసీఆర్‌కు కలిసొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధిదారులను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకోలేకపోవడంపైనా భేటీ చర్చ జరిగింది. మరోవైపు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

బలంగా ఉన్నచోట పనిచేసుంటే..!
119 నియోజకవర్గాల్లో పోటీతోపాటు పార్టీ బలంగా ఉన్న 30–40 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తే బాగుండేదని నడ్డా పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. కోర్‌ కమిటీ, ఆఫీస్‌ బేరర్లు, అభ్యర్థులు అంతా ఫలి తాలను సమీక్షించుకొని సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, సమష్టిగా పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రజల భావనను మార్చడంలో విఫలమయ్యామని నడ్డా పేర్కొన్నారు.

సమన్వయ లోపంతోనే ఓటమి: దత్తాత్రేయ 
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణమేనని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాలను సమీక్షించుకున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో వాటిని సరిదిద్దుకుంటామన్నారు. పార్టీకి సంప్రదాయ ఓట్లు ఉన్నా చంద్రబాబుపై వ్యతిరేకత కారణంగానే టీఆర్‌ఎస్‌కు ఓట్లుపడ్డాయన్నారు. ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై ఉండదని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు