బీజేపీ చీఫ్‌గా నడ్డా!

20 Jan, 2020 02:39 IST|Sakshi

ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం   

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు.

విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని  మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు.  

అమిత్‌ షా అడుగు జాడల్లో..
ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్‌ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్‌ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నడ్డా వ్యవహరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా