పరిమిత అవగాహనతోనే ఈ విమర్శలు: నడ్డా

30 May, 2020 21:12 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా క్లిష్ట సమయంలో కూడా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ విమర్శలకు దిగుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ పరిస్థితులు, లాక్‌డౌన్‌ సంక్షోభంపై అవగాహన లేకనే అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. పరిమితమైన అవగాహనతో రాహుల్‌ చేసే విమర్శల్లో అర్థం లేదన్నారు. ‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సరైందిని కాంగ్రెస్‌ నేతలు గతంలోనే చెప్పారు. ఇప్పుడేమో లాక్‌డౌన్‌ విఫలమైందంటున్నారు’ అని నడ్డా విమర్శించారు. మోదీ ప్రభుత్వం రెండో దఫా అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

ఏడాది పాలనా కాలంలో ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని నడ్డా కొనియాడారు. ఎంతో బలమైన దేశాలు సైతం మహమ్మారి కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయని.. వైరస్‌ కట్టడిలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. వాటి ఫలితంగానే దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉందన్నారు. కరోనా తొలినాళ్లలో దేశవ్యాప్తంగా రోజుకు 10 వేల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరగ్గా.. ఇప్పుడు రోజుకు 1.5 లక్షల పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. దేశంలో రోజుకు 4.5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో స్వయంగా సమృద్ధి దిశగా దేశం పురోగమిస్తుందని నడ్డా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు