పారదర్శకత ఏపీ నుంచి మొదలువుతోంది: సీఎం జగన్‌

26 Jul, 2019 17:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే పారదర్శకతకు ఆంధ్రప్రదేశ్‌ వేదిక కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలించి ప‍్రతి పనిలోనూ పారదర్శకత తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. అవినీతిని నిరోధించడానికి, మరింత మెరుగైన పరిపాలన అందించడానికి ముందస్తు న్యాయ సమీక్ష బిల్లు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోంది. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందనేది సభ్యులు ఇప్పటికే సభలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందుగా ఎవరైనా ప్రారంభిస్తేనే వస్తుంది. 

ముందస్తు న్యాయసమీక్ష అనేది ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదు. అది మన రాష్ట్రం నుంచే మొదలవుతుంది. పారదర్శకత అన్న పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశంలో ఎప్పుడు జరగని విధంగా.. అవినీతిని అంతమొందించేందుకు, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. చాలాసార్లు అవినీతికి వ్యతిరేకంగా నాయకులు మాట్లాడారు. నిజంగా ఏం చేస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది ఎప్పుడు జరుగలేదు. నిజంగా పారదర్శకత అన్నదానికి అర్థం తెచ్చేందుకు ఈ బిల్లు తెచ్చాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్‌ గమనిస్తే స్కామ్‌ కనిపిస్తుంది.

తాత్కాలిక భవనం కట్టడానికే అడుగుకు రూ.10 వేలు ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఇలాంటి పరిస్థితి పూర్తిగా మారాలంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది నాకంటే ముందు మాట్లాడిన వారు చెప్పారు. ఈ బిల్లు ద్వారా రూ.100కోట్లు, దానికి పైబడిన ప్రతి టెండర్‌ ప్రభుత్వ టెండర్‌ ఏదైనా జడ్జి పరిధిలోకి వస్తుంది. టెండర్ల పరిశీలనకు హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు అవుతుంది. నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్‌ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. ఆ జడ్జి ఆ టెండర్‌ డాక్యుమెంట్‌ పబ్లిక్‌ డొమైన్‌లో వారం రోజుల పాటు పెడతాం. నేరుగా జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరినైనా కోరవచ్చు. 

జడ్జి వీళ్లు ఎవరూ వద్దు, ఫలాని వారు కావాలని కోరితే వారిని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జడ్జి టెండర్‌కు సంబంధించిన సలహాలు తన వద్ద ఉన్న టెక్నికల్‌ టీమ్‌తో చర్చిస్తారు. ఆ తరువాత జడ్జి సంబంధిత శాఖను పిలిచి తాను ఏదైతే సబబు అనుకుంటారో..వాటిని సూచిస్తూ మార్పులు చేస్తారు. అదే మార్పులు తూచా తప్పకుండా చేసిన తరువాతే టెండర్‌ డాక్యుమెంట్‌ పూర్తి చేస్తాం. ఇంత నిజాయితీగా, పారదర్శకంగా ఒక వ్యవస్థను తయారు చేయడం దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎక్కడా జరుగలేదు. ఏపీ నుంచే ఇది మొదలవుతుంది.

ఇంత పారదర్శకంగా, నిజాయితీగా ఒక వ్యవస్థను సృష్టించి, వ్యవస్థ ద్వారా పారదర్శకత ఒక స్థాయి నుంచి మరోస‍్థాయికి తీసుకు వెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. ఇది ఇక్కడితో ఆగిపోదు, మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. ఇక్కడ మనం బీజం వేశాం. ఈ బీజం మహా వృక్షం అవుతుంది. దేశానికి దశ, దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా కూడా చెబుతున్నాను.

ఇక లోకాయుక్తా బిల్లును కూడా ఇవాళ తీసుకువచ్చాం. గతంలో ఈ బిల్లు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో లోకాయుక్తా అన్నది లేనే లేదు. అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది కాదు. కానీ ఆ ఆలోచన వారికి లేదు.  చిన్న చిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. లోకాయుక్తలో ఒక సిట్టింగ్‌ జడ్జి గాని, రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉంటేకాని లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి ఉంటే అయిదేళ్ల క్రితమే లోకాయుక‍్త వచ్చి ఉండేది. కానీ  లోకాయుక్త అన్నది రానేరాకుండా, గత అయిదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ‍్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45రోజుల్లోనే పారదర్శకత, వ్యవస్థలో మార్పు కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గర్వంగా ఉంది.’ అని అన్నారు. కాగా లోకాయుక్తా, ముందస్తు న్యాయ సమీక్ష బిల్లులకు ఆమోదం అనంతరం శానససభ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు