కీలక వ్యవస్థలు నాశనం

27 Aug, 2018 03:08 IST|Sakshi
లండన్‌లోని రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రసంగిస్తున్న రాహుల్‌ గాంధీ

మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ ధ్వజం

లండన్‌: బీజేపీ పాలనలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) తదితర సంస్థలను నాశనం చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. 2014కు ముందు దేశంలో అభివృద్ధే జరగలేదనడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను అవమానించారన్నారు. లండన్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యులనుద్దేశించి ఆదివారం రాహుల్‌ ప్రసంగించారు. ‘ప్రపంచ భవిష్యత్తును భారత్‌ నిర్దేశిస్తోంది. కాంగ్రెస్‌ సహాయంతోనే భారతీయులు దీన్ని సాధ్యం చేసి చూపించారు.

ఆయన పగ్గాలు చేపట్టకముందు దేశంలో అభివృద్ధే జరగలేదని అంటే ప్రతి భారతీయుడిని అవమానించినట్లే’ అని రాహుల్‌ పేర్కొన్నారు. దేశంలో దళితులు, రైతులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు వారికి కావాల్సిన దానిగురించి గొంతెత్తితే భౌతికదాడులకు పాల్పడుతున్నా రని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీలపై దాడుల నియంత్రణ చట్టాన్ని అటకెక్కించారని, స్కాలర్‌షిప్‌లను ఆపేశారని ఆరోపణలు చేశారు. దేశంలో రైతులకు రుణమాఫీ చేయకుండా అనిల్‌ అంబానీ వంటి వ్యక్తులకు మాత్రం అనుచితంగా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. పార్లమెంటులో రాఫెల్‌ ఒప్పందంపై తన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు.

మరిన్ని వార్తలు