ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను : జూపల్లి

12 Dec, 2018 13:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొల్లాపూర్‌ ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన ఐదు సార్లు తనను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధి కారణంగానే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిచిందన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ, పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొల్లాపూర్‌ నియోజకవర్గానికి తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు. కొల్లాపూర్‌ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అండదండగా ఉంటానన్నారు. ఎన్నికల కోడ్‌ వల్ల కొన్ని పనులు ఆగిపోయాయని, కొన్ని ప్రారంభించలేకపోయానని తెలిపారు.

18 కోట్ల ముక్కిడి గుండం కెనాల్‌, నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం, 29 కోట్లు మంజూరైన 100 పడకల ఆస్పత్రి పనులు, కళ్యాణ మండపం, పాత్‌వేల పనులను ఇప్పుడు కొనసాగిస్తానని చెప్పారు. నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని అన్ని పథకాలు అమలు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దన్నారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో ఉండాలని పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లో గడిచిన 19 ఏళ్లపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వలేదని, అదే కొనసాగేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా కృషి చేస్తానన్నారు. కొల్లాపూర్‌ను కోహినూర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు