దోషం భక్తులది.. పాపం మీడియాది  

20 Sep, 2018 03:42 IST|Sakshi
ప్రమాద ఘటన దృశ్యం (ఫైల్‌)

     గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై తేల్చేసిన జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌

     29 మంది భక్తుల మృతికి ముమ్మాటికీ ఇదే కారణం 

     పుష్కరాలు జరిగే 12 రోజులూ పుణ్యకాలమే... 

     దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయారు 

     ఆ ముహూర్తానికే స్నానం చేయాలని మీడియాలో ప్రచారం

     ప్రచారమనే చెడ్డవాహిక వల్ల ప్రాణాలను చెల్లించాల్సి వచ్చింది  

     సీఎం స్నానం చేసి వ్యాన్‌లోకి వెళ్లాకే తొక్కిసలాట జరిగింది 

     అప్పటి కలెక్టర్‌ ప్రాథమిక నివేదికను పట్టించుకోని కమిషన్‌ 

     ముఖ్యమంత్రి పుష్కర స్నానం షూటింగ్‌ వ్యవహారాన్నీ ప్రస్తావించని వైనం 

     కమిషన్‌ తీరుపై బాధితుల కుటుంబ సభ్యుల ఆగ్రహం 

     సీఎం చెప్పినదాన్నే నివేదికలో పెట్టారంటున్న అధికార వర్గాలు

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్‌ జస్టిస్‌ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 

సీఎం ప్రచార యావకు సామాన్యులు బలి 
గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై అప్పటి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదికను గానీ, అలాగే ఘటన ఎలా జరింగిందనే దానిపై మీడియాలో వచ్చిన కథనాలను గానీ ఏకసభ్య కమిషన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు కమిషన్‌ ముందు విచారణకు హాజరై ఇచ్చిన నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహించామని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నానం చేస్తుండగా వెనుక పెద్ద ఎత్తున జనసందోహం కనిపించేలా వీడియోలు చిత్రీకరించడం, దానివల్లే తొక్కిసలాట జరగడాన్ని ఏకసభ్య కమిషన్‌ పట్టించుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చెబితే అదే నివేదికలో రాసిచ్చినట్లుగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పైగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుష్కర స్నానాన్ని కూడా ప్రస్తావిస్తూ దానికి మీడియాలో ప్రచారం కల్పించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీపై ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తాయని నివేదికలో ప్రస్తావించారు. 29 మంది మృతి చెందడం సాధారణ విషయమేనని, అందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, పొరపాటంతా పుష్కర భక్తులది, ప్రచారం చేసిన మీడియాదేనని నివేదికలో పేర్కొన్నారు. 

కమిషన్‌ నివేదికలో ఏముందంటే... 
‘‘పుష్కరాలలో తీర్థవిధులు నిర్వర్తించడమే చాలా ముఖ్యమైన అంశం. భక్తులు తమ పెద్దల పుణ్యతిథి రోజు ఈ తీర్థవిధులు నిర్వర్తిస్తారు. అందరు తల్లిదండ్రుల తిథులు ఒకే రోజు రావుకదా! ఈ ఇంగితాన్ని తెలుసుకోలేని ప్రసార మాద్యమాలు, ప్రవచన పండితులు, పంచాగకర్తలు, స్వామీజీలు ప్రజలను మూఢ నమ్మకాల్లో ముంచెత్తారు. నదీ స్నానం తెల్లవారుజామున చేస్తే అది దేవత స్నానం, సూర్యోదయం తరువాత చేస్తే మనుష్య స్నానం, ఎప్పుడుపడితే అప్పుడు చేస్తే అది రాక్షస స్నానం అని విశ్వాసం. కానీ, పుష్కరాల సమయంలో ఎప్పుడు స్నానం చేసినా అది పుణ్యప్రదమేనని సూత మహర్షి తన శిష్యులకు చెప్పారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ సంగతిని ఏ టీవీ చానల్లోనూ సరిగ్గా చెప్పలేకపోయారు. ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి తప్పుదోవ పట్టించారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ పుణ్యకాలమేనని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేక తాము ఓ గొప్ప విషయాన్ని చెబుతున్నట్లుగా భావించి ఆ ముహూర్తానికే పుష్కర స్నానం చేయాలంటూ మీడియాలో ఊదరగొట్టారు. దీనివల్ల లక్షలాది మంది భక్తులు గోదావరి తీరాన పడిగాపులు పడ్డారు. ముహూర్తకాలంలోనే స్నానం చెయ్యకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో ఒక్కసారిగా వెల్లువలా నదిలోకి పరుగులు పెట్టారు. పల్లంలోకి ప్రవహించే నీటిని ఆపగలమా? ప్రచారమనే చెడ్డవాహిక వల్ల ఎన్నో ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి స్నానం చేసి వ్యాన్‌లోకి వెళ్లిన తరువాతే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని ఏకసభ్య కమిషన్‌ నివేదికలో వెల్లడించారు. 

జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక 
ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌ను వదిలి ఉదయమే 6.26 గంటలకు ఇతర వీఐపీలతో కలిసి పుష్కర ఘాట్‌కు ఎందుకు వచ్చారనే విషయాన్ని కమిషన్‌ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అక్కడ షూటింగ్‌ ఎందుకు నిర్వహించారనే అంశాన్ని ప్రస్తావించలేదు. తొక్కిసలాట ఘటనపై అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆ నివేదిక గురించి ఏకసభ్య కమిషన్‌ కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా వీవీఐపీలు, వీఐపీల కోసం పుష్కర ఘాట్‌ను గంటల తరబడి మూసివేశారని, తరువాత ఒక్కసారిగా గేట్లు తెరవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. రెండు రోజుల ముందు నుంచే భక్తులు రాజమండ్రికి రావడం ప్రారంభించారని, పుష్కరాలు ప్రారంభం కాగానే నదిలో స్నానం చేయాలని ఉత్సుకతతో ఆ రోజు తెల్లవారుజూమునే పుష్కర ఘాట్‌కు తరలివచ్చారని జిల్లా కలెక్టర్‌ తన నివేదికలో తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోపాటు వీవీఐపీలు, వీఐపీలు ఉదయం 6.26 గంటల నుంచి పుష్కర ఘాట్‌లో ఉన్నారని, గోదావరి నదిలో తొలుత స్నానం చేసి పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని, వారు స్నానం పూర్తయ్యి బయటకు వచ్చేసరికి ఉదయం 8.30 గంటలైందని కలెక్టర్‌ పేర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ భక్తులను అనుమతించకపోవడంతో తాకిడి విపరీతంగా పెరిగిపోయిందని, ఆ తర్వాత కూడా కేవలం ఒక్క గేటునే తెరవడంతో తొక్కిసలాట జరిగిందని, పోలీసులు నిలువరించలేకపోయారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాలను ఏకసభ్య కమిషన్‌ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో షూటింగ్‌  
గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనుక కనిపిస్తుండగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్‌ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వీఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. సీఎం, కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే, చివరి నిముషంలో జనసమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్‌ చేసి, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ తీయాలని నిర్ణయించారు. దీంతో సీఎం, కుటుంబ సభ్యులు వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కర ఘాట్‌కు వచ్చారు. దీంతో భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్‌ కెమేరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్‌ తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షులంతా ఇదే విషయం చెప్పారు. అయితే ఏకసభ్య కమిషన్‌ తన నివేదికలో దీనిగురించి ప్రస్తావించకపోవడం పట్ల బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాల షూటింగ్‌లు, ప్రచారాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 

మరిన్ని వార్తలు