రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!

10 Mar, 2020 14:56 IST|Sakshi
అమిత్‌ షా- సింధియా (ఫైల​ ఫోటో)

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువైన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో సింధియా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల తరువాత బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్‌ టాండన్‌ లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

రాజ్యసభ.. కేంద్రమంత్రి..!
సింధియా అనుచరవర్గంగా భావిస్తున్న రెబల్‌ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం బెంగళూరు రిసార్టులో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా చేసిన వెంటనే వారంతా కూడా గుడ్‌బై చెప్పడంతో తిరుగుబాటు సభ్యులతో కలిసి సింధియా బీజేపీ గూటికి చేరతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా జ్యోతిరాధిత్యను రాజ్యసభకు పంపేందుకు కేంద్ర పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నెలఖరులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లోనే ఆయన్ని నామినేట్‌ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ చేరితే కేంద్రమంత్రివర్గంలోనూ సింధియాకు చోటు కల్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ పెద్దలతో సింధియా అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది.

చిచ్చుపెట్టినే సీఎం పీఠం..
మరోవైపు వరుస ఓటములతో కుదేలవుతున్న గ్రాండ్‌ఓల్డ్‌ పార్టీకి సింధియా ఊహించని షాక్‌ ఇచ్చారు. సీఎం కుర్చి తనదేనంటూ గత ఎన్నికల్లో ప్రచారాన్ని భుజాలకెత్తుకుని ముందుండి నడిపించిన మహరాజ్‌ సింధియా.. సీఎం సీటు దక్కకపోవడంతో అధిష్టానంపై గతకొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో ఇదే సరైన సమయంగా భావించి చాకచక్యంగా పావులుకదిపారు. దీంతో కమల్‌నాథ్‌ సీఎం కుర్చికి సంకటం ఏర్పడింది. సింధియా వ్యూహాలు ఫలించినట్లయితే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా చేయకతప్పదు. ఇదిలావుండగా కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిందని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభ్యులు గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలన్నీ మధ్యప్రదేశ్‌ చూట్టు తిరుగుతున్నాయి. 


 

మరిన్ని వార్తలు