కాంగ్రెస్‌ పార్టీకి సింధియా రాజీనామా

10 Mar, 2020 12:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాధిత్య సింధియా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేధాల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి నరేంద్రమోదీతో భేటీ అయిన సింధియా.. కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తనతో పాటు మరో 17మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. వారందరినీ బెంగళూరులోని ఓ రిసార్టుకు తరలించారు.
(చదవండి : మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా)

సింధియా రాజీనామాతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు సింధియా బీజేపీలో చేరడానికి సర్వం సిద్దమయ్యారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆయన బీజేపీలో చేరబోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర కేబినెట్‌లోకి వెళ్తారని సమాచారం. ఇక మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే మధ్యప్రదేశ్‌ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 
(చదవండి : ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా?)

అందుకే రాజీనామా చేశా : సింధియా
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానని సింధియా పేర్కొన్నారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని.. ఏడాది కాలంగా కాంగ్రెస్‌ను వీడాలని ఆలోచిస్తున్నానని చెప్పారు.  రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు,  కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సోనియాగాంధీకి పంపిన లేఖలో సింధియా పేర్కొన్నారు.
(చదవండి : కమల్‌ సర్కార్‌లో సింధియా చిచ్చు)

సింధియాపై బహిష్కరణ వేటు
మరోవైపు సింధియాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఏఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సింధియా బహిష్కరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్టు పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు