ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా

25 Nov, 2019 12:53 IST|Sakshi

గ్వాలియర్‌ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రంలోని పార్టీ నాయకత్వంపై కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. తన ట్విటర్‌ ఖాతాలో ఉన్న కాంగ్రెస్‌కు సంబంధించిన తన వ్యక్తిగత వివరాలను కూడా మార్పులు చేశారు. ఎక్కడా కూడా కాంగ్రెస్‌ పార్టీ పేరు కనిపించకుండా.. ప్రజాసేవకుడిగా, క్రికెట్‌ ఔత్సాహికుడిగా తన అధికారిక ఖాతాలో దర్శనమిస్తున్నాయి. కాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. నెల క్రితమే ప్రజల సలహా మేరకు తన ట్విటర్‌ ఖాతాలోని వివరాలను మార్చినట్లు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడైన దివంగత మాధవరావు సింధియా వారసుడిగా జ్యోతిరాదిత్య రాజకీయాల్లో అరంగేట్రం చేశారు.

మధ్యప్రదేశ్ లోని గుణ, శివ్ పురి లోక్‌సభ స్థానం నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తూ వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా పరాజయం చూశారు. భారతీయ జనతాపార్టీకి చెందిన కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. గతంలో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో బీజేపీకి అనుకూలంగా జ్యోతిరాదిత్య సింధియా కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై అప్పట్లోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఈ వ్యవహారాలతో విసిగిపోయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా