కాంగ్రెస్‌కు సింధియా గుడ్‌బై

11 Mar, 2020 03:08 IST|Sakshi

అమిత్‌ షా, మోదీతో భేటీ అనంతరం నిర్ణయం

రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం

మైనార్టీలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సర్కారు

పార్టీకి 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా

ఏర్పాటైన 15 నెలలకే పతనం దిశగా కమల్‌నాథ్‌ ప్రభుత్వం

దేశమంతా హోలీ సంబరాల్లో ఉన్న వేళ కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. ఇటు కమల్‌నాథ్‌ సర్కార్‌ సంక్షోభం.. అటు బీజేపీలో సంబరాలు.. వెరసి మధ్యప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీతో భేటీ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించగానే బీజేపీ కార్యకర్తలు రంగులు  చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించింది. అధికార కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తూ 22 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు లేఖలు పంపడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం కమల్‌నాథ్‌.. గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు లేఖ రాశారు. మొత్తంగా 15 నెలల కమల్‌నాథ్‌ సర్కారు పాలన కూల్చివేత అంచున ఊగిసలాడుతోంది.

న్యూఢిల్లీ/భోపాల్‌: దేశమంతా హోలీ వేడుకల్లో ఉన్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మధ్యప్రదేశ్‌లో ఏర్పాటైన 15 నెలల కాంగ్రెస్‌ సర్కారు పతనం అంచున చేరింది. గ్వాలియర్‌ రాజ కుటుంబానికి చెందిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ను వీడటం.. ఆ వెంటనే ఆయనకు మద్దతుగా 22 మంది శాసన సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖలు పంపడంతో సీఎం కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాజీనామాలు చేసిన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్‌ ప్రభుత్వం 92 మంది సొంత ఎమ్మెల్యేలతో మైనార్టీలో పడుతుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మద్దతిస్తున్న ఏడుగురు ఇతర సభ్యుల మద్దతు కీలకం కానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ శాసన సభా పక్ష సమావేశాలను నిర్వహించి తమ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాయి.  

అమిత్‌ షాతో భేటీ అనంతరం ప్రధాని వద్దకు.. 
సింధియా ఉదయం తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి ఢిల్లీలోని 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షురాలు సోనియాకు సింధియా లేఖ పంపారు. ‘18 ఏళ్లుగా కాంగ్రెస్‌ సభ్యుడిగా ఉన్నా. ఇక ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకా పార్టీలో కొనసాగితే దేశ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయలేనని అనిపిస్తోంది. నా ప్రజలు, కార్యకర్తల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మెరుగని భావిస్తున్నా. ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’ అని లేఖలో సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నుంచి సింధియా బహిష్కరణను సోనియా ఆమోదించినట్లు ఏఐసీసీ తెలిపింది.

రాజ్యసభకు జ్యోతిరాదిత్య! 
జ్యోతిరాదిత్య నేడో రేపో బీజేపీలో చేరవచ్చని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు ఈనెల 13తో గడువు ముగుస్తున్నందున ఈలోపే ఆయన కచ్చితంగా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సింధియా నిర్ణయాన్ని ‘ఘర్‌ వాపసీ’గా ఆయన మేనత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజే అభివర్ణించారు. తన తండ్రి, దివంగత కాంగ్రెస్‌ నేత మాధవరావు సింధియా 75వ జయంతి రోజే జ్యోతిరాదిత్య పార్టీతో బంధాన్ని తెంచుకోవడం గమనార్హం.  

స్వతంత్రులు, ఇతరులు కీలకం
ప్రస్తుతం 228 మంది ఎమ్మెల్యేలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో తిరుగుబాటుకు ముందు కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా తాజా రాజీనామాలతో సొంత బలం 92కి పడిపోయింది. సభలో బల నిరూపణకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 104 కాగా బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యులున్నారు. నలుగురు స్వతంత్రులతోపాటు ఇద్దరు బీఎస్పీ సభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పటివరకు మద్దతిస్తున్నారు. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌ సింగ్‌ కుశావహ, సమాజ్‌వాదీ శాసన సభ్యు డు రాజేశ్‌ శుక్లా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌తో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

స్పీకర్‌కు లేఖలు అందించిన బీజేపీ నేతల బృందం 
కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన 19 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను బీజేపీ నేతల బృందం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతికి అందచేసింది. రాజీనామా లేఖలు అందాయని, నియమ నిబంధనలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ తెలిపారు. సీనియర్‌ బీజేపీ నేత భూపేంద్రసింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలతో ప్రత్యేక విమానంలో భోపాల్‌ చేరుకున్నట్లు పార్టీ ఎమ్మెల్యే విశ్వాస్‌ సారంగ్‌ తెలిపారు. మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేరుగా రాజీనామాలు అందించారు. ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ, భూపేంద్రసింగ్, నరోత్తమ్‌ మిశ్రా, సారంగ్‌తో కూడిన బృందం స్పీకర్‌ నివాసానికి చేరుకుని కాంగ్రెస్‌ సభ్యుల రాజీనామాలను అందచేసింది. ఒకవైపు ఈ ఉత్కంఠ కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్‌ రాజీనామా చేసిన ఆరుగురు మంత్రులను తక్షణమే తొలగించాలని కోరుతూ కమల్‌నాథ్‌ గవర్నర్‌కు లేఖ రాశారు.  

పోలీస్‌ రక్షణ కోరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు  
తమకు పోలీస్‌ రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు చేరుకున్న 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. ఓ అత్యవసర పని నిమిత్తం తాము కర్ణాటకకు స్వచ్ఛందంగా వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. బెంగళూరు పరిసరాల్లో తాము స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా భద్రత కల్పించాలని ఈనెల 9వ తేదీతో ఉన్న లేఖలో కోరారు. వీరిలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలున్నారు.  

కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు  
సింధియాను బుజ్జగించేందుకు రాజస్తాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ను దూతగా పంపినా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆ యత్నాలు ఫలించలేదని తెలిపాయి. ‘మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం త్వరలోనే పరిష్కారమై నేతల మధ్య తలెత్తిన విబేధాలు ముగుస్తాయని భావిస్తున్నా. ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు రాష్ట్రానికి స్థిరమైన సర్కారు అవసరం’అని సచిన్‌ పైలట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్‌ నేతలెవరూ పార్టీని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లరని మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.  మరోవైపు మంగళవారం జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావ్‌ సింధియా జయంతి సందర్భంగా ఆయన రాజకీయ చాణక్యుడని ప్రశంసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ట్వీట్‌ చేసింది. మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా ట్వీట్‌ చేసిన వారిలో ఉన్నారు.  

ఎగసిన అసంతృప్తి: మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో పాత తరానికి చెందిన సీఎం కమల్‌నాథ్‌తో సింధియాకు దీర్ఘకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎన్నికల అనంతరం స్వల్ప మెజార్టీతో కమల్‌నాథ్‌ పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వంలో సింధియా మద్దతుదారులను పక్కనబెట్టడం, రాష్ట్ర కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు కూడా దక్కకపోవడంతో ఆయన శిబిరంలో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం కూడా ఈ విషయాలను పట్టించుకోకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజా పరిణామాలతో నేతలను ఏకతాటిపై నడపటంలో నాయకత్వ లేమి మరోసారి బయటపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

లక్నో హోలీ వేడుకల్లో గవర్నర్‌ లాల్జీ 
రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని, ఏ నిర్ణయమైనా రాజ్‌భవన్‌ చేరుకున్నాక తీసుకుంటానని లక్నోలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నేను ప్రేక్షకుడిని మాత్రమే. అక్కడకు (భోపాల్‌) చేరుకున్నాక అన్నీ గమనించాక స్పందిస్తా’అని చెప్పారు.

సర్కార్‌కు ముప్పులేదు: సీఎం కమల్‌
‘‘నా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నా. వారిని బందీలుగా ఉంచారు. లేదంటే ఎమ్మెల్యేలు బెంగళూరులో ఎందుకు ఉంటారు?’అని సీఎం కమల్‌నాధ్‌ మంగళవారం రాత్రి పేర్కొన్నారు.

తమ రాజీనామా లేఖలను బెంగళూరులోని రిసార్ట్‌లో మీడియాకు చూపిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

చదవండి:
సింధియా టైమ్స్‌
బీజేపీలో సింధియాలు.. సింధియాలో బీజేపీ
 

మరిన్ని వార్తలు