సింధియా టైమ్స్‌

11 Mar, 2020 01:29 IST|Sakshi

సహనం కోల్పోయిన జ్యోతిరాదిత్య

ఆపరేషన్‌ కమల్‌కి ఆకర్షితులయ్యారిలా..!

న్యూఢిల్లీ: అది 2018 డిసెంబర్‌ 13.. మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకున్నాక ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందా అని జోరుగా చర్చలు జరుగుతున్న వేళ. ఆ టైమ్‌లో రాహుల్‌గాంధీ కుడిచేత్తో జ్యోతిరాదిత్య సింధియాని, ఎడమ చేత్తో కమల్‌నాథ్‌ చేయి పట్టుకొని ఉన్న ఫొటోతో పాటు టాల్‌స్టాయ్‌ ప్రముఖ కొటేషన్‌ ‘అత్యంత శక్తిమంతమైన పోరాటయోధులు ఇద్దరే. ఒకరు సహనం, మరొకరు సమయం’’ అని షేర్‌ చేశారు. అది జరిగిన సరిగ్గా 15 నెలలు తర్వాత సింధియాలో సహనం నశించింది. పార్టీని వీడాల్సిన టైమ్‌ కూడా వచ్చిందని అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర్నుంచి సింధియా చాలా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఏకాకిగా మారిపోయారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త జవసత్వాలు కల్పించడానికి ఎనలేని కృషి చేసి పార్టీకి ఒక జ్యోతిగా మారిన సింధియా సీఎం పదవిని ఆశించారు.

కమల్‌నాథ్, దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన జుగల్‌బందీ రాజకీయాలతో ఆయన ఆశించిన పదవి దక్కలేదు. సింధియాకు అనుభవం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించారు. సోనియాగాంధీ. పీసీసీ అధ్యక్ష పదవిని కూడా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్న కారణంతో తిరస్కరించారు. సీఎం కమల్‌నాథ్‌ ఆయనతో ఎప్పుడూ కలిసి నడవలేదు. పార్టీపైన కూడా కమల్‌నాథ్‌ ఆధిపత్యమే కొనసాగింది. ఆ తర్వాత జ్యోతిరాదిత్యని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇది ఒక రకంగా పనిష్మెంట్‌ అనే చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీకి ఉనికి కూడా లేని ప్రాంతానికి ఇన్‌చార్జ్‌గా నియమాకం జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు.

ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అలాంటి సమయంలోనే బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపింది. అప్పటికే కమల్‌నాథ్, దిగ్విజయ్‌ సింగ్‌ చేస్తున్న రాజకీయాలతో పార్టీలో తనకెలాంటి భవిష్యత్‌ ఉండదని భావించిన జ్యోతిరాదిత్య సింధియా ఆపరేషన్‌ కమల్‌కి ఆకర్షితులైనట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. సింధియాని రాజ్యసభకు పంపించి ఎన్డీయే కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తారని, చౌహాన్‌ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో సర్కార్‌ ఏర్పడితే సింధియా వెంట వచ్చే ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో మంత్రి పదవులివ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించినట్టు సమాచారం.

ఏడాదిగా సంకేతాలు  
జ్యోతిరాదిత్య పార్టీ వీడి కాషాయం గూటికి చేరుతారని ఏడాదిగా సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. 2019 జనవరిలో ఆయన బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత అది మర్యాదపూర్వక సమావేశమనేనని ఇరువురు నేతలు చెప్పుకున్నారు. 2019 నవంబర్‌లో ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లలో తన బయోడేటా నుంచి కాంగ్రెస్‌ పార్టీ పేరుని, ప్రధాన కార్యదర్శి అన్న హోదాను తొలగించి సామాజికవేత్త, క్రికెట్‌ ప్రేమికుడు అని రాసుకున్నారు. ఇక సోనియా, రాహుల్‌ నిర్ణయాలు, వివిధ అంశాల్లో పార్టీ వైఖరి కూడా జ్యోతిరాదిత్యకు మింగుడుపడలేదు. కశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దుపై కూడా ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా చాలా కాలంగా జ్యోతిరాదిత్య పార్టీని ఏ క్షణంలోనైనా   వీడుతారన్న ప్రచారమైతే జరుగుతోంది.

నాడు మోదీ మ్యాజిక్‌ను తట్టుకుని
మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా మాధవరావు సింధియా దంపతులకు 1971, జనవరి 1న బొంబాయిలో జన్మించారు. డెహ్రాడూన్‌ డూన్‌ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. స్టాన్‌ఫర్డ్‌ బిజినెస్‌ స్కూలు నుంచి ఎంబీఏ చేశారు.2001లో హెలికాప్టర్‌ ప్రమాదంలో తండ్రి మాధవరావు మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తండ్రి మృతితో ఖాళీ అయిన గుణ స్థానం మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మన్మోహన్‌ కేబినెట్‌లో కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. 2014  సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మ్యాజిక్‌ను తట్టుకొని లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు