బీజేపీ ముఖ్య నేతతో సింధియా భేటీ

22 Jan, 2019 16:05 IST|Sakshi
భేటీ అనంతరం సింధియాను సాగనంపుతున్న చౌహాన్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ తాజా మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కాంగ్రెస్‌ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చౌహాన్‌ నివాసంలో సోమవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. ఇరువురు నేతలు 40 నిమిషాల పాటు రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజధానికి దూరంగా ఉండేందుకు మొగ్గుచూపే సింధియా తన అనుచరుల కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోవడంతో పరామర్శించడానికి సోమవారం భోపాల్‌కు వచ్చారు. అక్కడ నుంచి ఆశ్చర్యకరంగా నేరుగా చౌహాన్‌ ఇంటికి వెళ్లారు. అయితే మర్యాదపూర్వకంగా కలుసుకున్నామని నేతలిద్దరూ చెప్పడం విశేషం. సమావేశం ముగిసిన తర్వాత కారు వరకు వచ్చి సింధియాను చౌహాన్‌ సాగనంపడం విశేషం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతామని ఈ సందర్భంగా సింధియా చెప్పారు. ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌.. దావోస్‌కు వెళ్లిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం.

చౌహాన్‌-సింధియా సమావేశంపై కాంగ్రెస్‌, బీజేపీ భిన్నంగా స్పందించాయి. దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, అభివృద్ధి పనులకు చౌహాన్‌ సహకారం కోరేందుకే ఆయనతో సింధియా భేటీ అయ్యారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనాక్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. చౌహాన్‌ను సింధియా మర్వాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్‌ ఉలికిపడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్‌ అగర్వాల్‌ ఎద్దేవా చేశారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠం కోసం సింధియా ప్రయత్నించారు. సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌వైపు అధిష్టానం మొగ్గుచూపడంతో ఆయన సీఎం అయ్యారు. మరోవైపు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకునేందుకు బీజేపీ ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది.

మరిన్ని వార్తలు