రాజస్తాన్‌ సంక్షోభం : సింధియా ట్వీట్‌

12 Jul, 2020 18:37 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అనిశ్చితిపై బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఘాటుగా స్పందించారు.  కాంగ్రెస్‌ పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్.. ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను కావాలనే పక్కకు బెట్టి, ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తన మాజీ సహచరుడు సచిన్‌ను ఇలా చూడటం బాధగా ఉందన్నారు.(రాజస్ధాన్‌ సంక్షోభం : కాంగ్రెస్‌ సర్కార్‌కు షాక్‌!)

కాగా, మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సింధియా వెంట ఉన్న 22  మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి బీజేపీకి మద్దతు తెలుపడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారం చేపట్టారు. ఇప్పుడు రాజస్తాన్‌లో కూడా అలాంటి సంక్షోభమే కనిపిస్తోంది. ప్రస్తుతం సచిన్‌ తనకు మద్దతుగా ఉన్న 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌నుగద్దె దించేందుకు బీజేపీ నాయకులు సచిన్‌తో కొంతకాలంగా మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఇది కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత  వ్యవహారమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.(గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!‌)

మరోవైపు పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని పలువురు కాంగ్రెస్‌ నాయకులు అంగీకరించారు.  రాజస్థాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అదిష్టానం స్పందికపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరోనేత వివేక్‌ టాంకా స్పందిస్తూ.. ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీ బలహీనపడుతుందని అన్నారు.

>
మరిన్ని వార్తలు