డి.శ్రీనివాస్‌పై కేసీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు

6 Sep, 2018 16:34 IST|Sakshi

ఇష్టంగా పార్టీలోకి వచ్చాడు.. పార్టీని వీడితే ఆపేది లేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్‌పై కే చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌ ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని తెలిపారు. మొదట పార్టీ అడ్వయిజర్‌గా నియమించి ఆయనను గౌరవించామని తెలిపారు. డీఎస్‌ కోరిక మేరకు రాజ్యసభకు కూడా పంపామని కేసీఆర్‌ వెల్లడించారు.

అయితే, డీఎస్‌ కొడుకు అరవింద్‌ వేరే పార్టీలోకి వెళ్లడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం జరుగుతోందని నిజామాబాద్‌ నాయకులు ముక్త కంఠంతో తనకు ఫిర్యాదు చేశారని కేసీఆర్‌ తెలిపారు. కొడుకు వ్యవహారంపై డీఎస్‌ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. ఇష్టం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన డీఎస్‌ను తగిన విధంగా గౌరవించుకున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పార్టీలో ఉండాలనుకోవడం, వెళ్లాలనుకోవడం ఆయన సొంత విషయమనీ, ఎవరూ ఆయనను బలవంత పెట్టరని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు