ప్రతి స్కీం ఓ స్కాం: లక్ష్మణ్‌

30 Sep, 2019 04:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోందని.. అవినీతి లేని విభాగమే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రతి స్కీం వెనుక ఓ స్కాం ఉందని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపై బీజేపీ లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలపై టీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ దాడి చేస్తున్నారే తప్ప ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తునకు ముందుకు రావడం లేదన్నారు. మిషన్‌ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారిందని, ఈఎస్‌ఐలో రూ.300 కోట్ల స్కాం జరిగిందన్నారు.

అక్రమ సంపాదనతో రాజకీయాలు చేయడం, ఎన్నికల్లో గెలవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిపోయిందన్నారు. పచ్చదనం పేరుతో వేల కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలపై సీఎం నుంచి స్పందన లేదన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల్లో 10 శాతం కూడా కనిపించడం లేదన్నారు. గొర్రెల పంపిణీలో 90 శాతం అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పసిపిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరగడం దారుణమన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి తెలవకుండానే జరుగుతాయా అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్కటే..
ఇంటర్‌ బోర్డు అవకతవకలపై రాష్ట్రపతి నివేదిక కోరినా ఇంతవరకు స్పందన లేదని లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రేక్షక పాత్ర వహిస్తోందని, ఉత్తమ్, కేటీఆర్‌ పొద్దున తిట్టుకుంటూ సాయంత్రం సమాలోచన పెట్టుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండు ఒక్కటేనన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన భూమన్నను పోలీసులు అరెస్ట్‌ చేయడం బీజేపీ తప్పుపడుతోందన్నారు. అరెస్ట్‌ చేసిన సర్పంచ్‌ భూమన్నను వెంటనే విడుదల చేయాలన్నారు.

>
మరిన్ని వార్తలు