‘తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారు’

3 Jun, 2019 21:58 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ముప్పై ఏళ్ల త్యాగాలు, కృషి, ఫలితంగా తెలంగాణలో విజయం సాధించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో సాధించిన బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తండ్రీకొడుకులు ఢిల్లీలో బొంగరం కూడా తిప్పలేకపోయారని దుయ్యబట్టారు. పసుపు, ఎర్ర జొన్న రైతులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. తన కూతురు కవిత కోసం సీఎం ఎన్నో పాట్లు పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని, తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలకు చెక్‌ పెడతామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలమైన శక్తిగా మారుతామని పేర్కొన్నారు. ప్రజల కళ్లలో ఆనందం చూసేందుకే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని తెలిపారు. గత ఐదేళ్లలో కవిత చేయలేని అభివృద్దిని అరవింద్‌ చేసి చూపిస్తారని, పసుపు రైతుల సమస్యలను త్వరలోనే తీరుస్తామని హామి ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశంలో భవిష్యత్తు లేదని, భవిష్యత్తులో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. మజ్లిస్‌ పార్టీతో చేతులు కలిపితే జనం కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. భవిష్యత్తులో గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. నిజామాబాద్‌లో ఇకపై ప్రజల పాలన, కార్యకర్తల పాలన ఉంటుందని ఎంపీ అరవింద్‌ పేర్కొన్నారు. నిర్లక్ష్యం, అహంకారంతో కూడిన పాలనకు పాతర వేస్తామన్నారు. ఈ విజయం తెలంగాణను కైవసం చేసుకునేందుకు నాంది కావాలన్నారు. అవినీతి లేని పాలన అందిస్తామని​ హామి ఇచ్చారు.

మరిన్ని వార్తలు