‘సీఎం కుడి భుజాన్ని ఓడగొట్టాం’

28 May, 2019 17:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిస్తే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకు పోయిందని వారి పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని పునీతులు అవుతున్నారని అన్నారు. ప్రజలు నమ్మి ప్రతిపక్షస్థానం ఇస్తే కూడా.. వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ మీద పోరాటం చేసే​ స్థాయిలో కాంగ్రెస్‌ లేదని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందనీ, ఉత్తమ్‌ జైలుకు వెళ్తాడని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం వారు లోపాయికారి ఒప్పందంపై ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి విజయ దుందుభి మోగించామని, ఉద్దండుల మీద భారీ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీ ఎంపీలు జెయింట్‌ కిల్లర్స్‌.. సీఎం కూతురును, కుడి భుజాన్ని ఓడగొట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా తయారైందన్నారు. జాతీయ స్థాయిలోని వారి నాయకుడే అస్త్ర సన్యాసం చేశారని ప్రస్తుతం దిక్కూ దివాణం లేకుండా ఉందని అన్నారు.

బీజేపీ విజయాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్‌ ఇప్పుడు మోదీ హవా అంటున్నాడు.. ఎన్నికల ఫలితాలకు ముందు హవా లేదన్నావుగా అని నిలదీశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో 38 శాతం ఓట్లతో బీజేపీదే అగ్రభాగమని తెలిపారు. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు. యూపీలో స్వయంగా రాహుల్‌ ఓడిపోయాడని ఆరు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటును మాత్రమే గెలిచిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ఉత్తమ్‌, కేసీఆర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌తో గెలిచారని కాంగ్రెస్‌ నాయకులే అంటున్నారని అన్నారు.

కేసీఆర్‌ కుటుంబ పోకడతో టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీజేపీలో చేరారని అన్నారు. అమిత్‌ షా టార్గెట్‌ తెలంగాణ అని.. తెలంగాణలో భవిష్యత్‌ బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమం ఆగదని, ఇప్పుడు బీజేపీ కూడా అంతేనని అన్నారు. ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలను రోడ్‌ మీద వేశారని, ఇంటర్‌ తప్పిదాల విషయంలో ఇంటర్‌ కార్యదర్శి అశోక్‌ను, విద్యాశాఖా మంత్రిని తప్పించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు