బీజేపీ లక్ష్మణుడు

30 Nov, 2018 16:07 IST|Sakshi

మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన డాక్టర్‌ కోవా లక్ష్మణ్‌ పేదల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తిత్వం కలవారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందంజలో ఉండేవారు. విద్యార్థిగా ఉన్నపుడే తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, విద్యా రంగంలో ఉన్న లోపాల పట్ల పోరాడారు. ఉస్మానియా యూనివర్శిటీలోనే ఎమ్మెస్సీ పూర్తి చేసి తర్వాత అదే యూనివర్శిటీ నుంచి జియాలజీలో డాక్టరేట్ అందుకున్నారు. చదివిన చదువుతోనే ఉన్నతమైన ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ రాజకీయాలంటే తీవ్ర ఆసక్తి ఉండడంతో దానిని వదులుకున్నారు.

విద్యార్థి వయసులోనే ఉస్మానియా ఏబీవీపీ ప్యానెల్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ పార్టీలో అడుగుపెట్టి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒకసారి, అధికార ప్రతినిథిగా మూడు సార్లు తమ సేవలను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన పలు ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. 1994లో శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయాలంటూ చేసిన దోడా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1994లో ముషీరాబాద్‌ నుంచి మొదటిసారి పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీజేఎల్సీ శాసనసభా పక్షం ఉపనేతగా ఉన్నపుడు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి లోతైన అంశాలు మాట్లాడేవారు.
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి విస్తృత పర్యటనలు చేశారు. కేవలం మాటలు చెప్పడమేగాక వాటిని పాటించే వ్యక్తిగా ఆయన సుపరిచితుడు. యువకుడిగా ఉన్న రోజుల్లో హైదరాబాద్‌ లీగుల్లో క్రికెట్‌, జిల్లా స్థాయిల్లో వాలీబాల్ ఆడారు. పార్టీలో వివిధ స్థాయిలో సేవలు అందించడమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ముషీరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దిగారు.

లక్ష్మణ్‌ కుమారుడి వివాహంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, కేసీఆర్‌

కుటుంబ నేపథ్యం :
పుట్టిన తేదీ : 3 జూలై 1956
పుట్టిన స్థలం : హైదరాబాద్‌
తల్లిదండ్రులు : రాములు, మంగమ్మ
భార్య : ఉమ (ఇద్దరు కుమార్తెలు - శ్వేత, శృతి, ఒక కుమారుడు -రాహుల్)
చదువు : ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ
ఇష్టమైన ఆటలు : క్రికెట్‌, వాలీబాల్‌
సందర్శించిన దేశాలు : సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, చైనా, దక్షిణ కొరియా, యూఎస్‌

రాజకీయ ప్రస్థానం :
- 1980 భారతీయ జనతా పార్టీలో చేరిక
- 1995 - 99 బీజేపీ హైదరాబాద్‌ శాఖ అధ్యక్షుడు 
- 1994 లో కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమి
- 1999 లో ముషీరాబాద్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
- 2004,09 కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు
- 2014 లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు
- 2016 తెలంగాణ బీజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా తిరిగి ఎన్నిక

- పి. సృజన్‌ రావ్‌ (ఎస్.ఎస్.జే)

మరిన్ని వార్తలు