ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే కుట్ర

8 Oct, 2019 04:42 IST|Sakshi

కార్మికుల తొలగింపు అందుకోసమే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ అప్పుల పాలవ్వడానికి ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని, కావాలనే అప్పుల్లోకి నెడుతోందని, దానిని సాకుగా చూపి ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మెకోసం నెల రోజుల కిందటే నోటీస్‌లు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కార్మికులను తొలగిస్తూ సీఎం బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి సీఎం మాట్లాడుతున్నారని, బీజేపీ ఉన్న దగ్గర ఎక్కడా రవాణా వ్యవస్థ అప్పుల ఊబిలోకి పోలేదని, కార్మికులు ఆందోళన చేయలేదన్నారు. ప్రజలు మరో విజయదశమి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సకల జనుల సమ్మె చేసినప్పుడు పేద కార్మికుడు కూడా పస్తులుండి పాల్గొన్నారన్నారు. ఇపుడు మాత్రం అదే కార్మికులను రోడ్డున పడేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే నిప్పుతో గోక్కోవడమేనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికులను రాత్రికి రాత్రే తొలగించడం అలాంటిదేనన్నారు. దసరా పండుగ రోజున సీఎం ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని, జీతాలు ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? ఆయన జాగీరా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కార్మికుల విషయంలో సీఎం నిర్ణయం ఈ ప్రభుత్వ పతనానికి నాందని అన్నారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. 

ఎన్‌ఎంయూ నేతల భేటీ
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతివ్వాలని లక్ష్మణ్‌కు నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఎన్‌ఎంయూ నేతలు కమల్‌రెడ్డి, మౌలానా, నరేందర్‌ తదితరులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు.

>
మరిన్ని వార్తలు