కేఏ పాల్‌తో బాబు డీల్‌...

31 Mar, 2019 15:56 IST|Sakshi

ఇంటెలిజెన్స్‌ బాస్‌గా ఉన్నప్పుడు సెట్‌ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు!

ఎన్నికల్లో టీడీపీకి సహకరించేలా చీకటి ఒప్పందం

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరును పోలిన పేర్లతో 38 చోట్ల ప్రజాశాంతి అభ్యర్థులు

పాల్‌పై ఉన్న ఒంగోలు, మహబూబ్‌నగర్‌ కేసుల్లో సహకారానికి బాబు అంగీకారం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం కనిపిస్తుండడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు దానిని అడ్డుకునేందుకు అడ్డదారి కుతంత్రాలకు దిగారు. ఇందులో భాగంగా ప్రజాశాంతి పార్టీ నేత కిలారి ఆనంద పాల్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్‌ వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండటాన్ని అవకాశంగా తీసుకుని ఓటర్లను అయోమయంలో పడేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారు. ఆ మేరకు తనకు కలిసొచ్చేలా పాల్‌ను ఒప్పించినట్టు, ఇందుకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ బాస్‌గా ఉన్న సమయంలోనే పాల్‌తో డీల్‌ సెట్‌ చేసినట్టు పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయాలని, అంతా అనుకున్నట్టు జరిగితే ఎన్నికల తర్వాత పాల్‌పై గతంలో నమోదైన రెండు కేసుల నుంచి బయటపడేసేలా చంద్రబాబు సహకారం అందజేసేందుకు ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఒప్పందంలో భాగంగానే పాల్‌కు ఇంటెలిజెన్స్‌ వింగ్‌ నుంచి ఇద్దరు గన్‌మెన్‌లను కూడా కేటాయించినట్టు సమాచారం.

టీడీపీకోసం వైఎస్సార్‌సీపీని దెబ్బతీసే కుట్ర...
ప్రజాశాంతి పార్టీ జెండా, పార్టీ ఎన్నికల గుర్తు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి వాటిని పరిశీలిస్తే కేఏ పాల్‌ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీని దెబ్బతీసి టీడీపీకి మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ జెండాను పోలినట్టుగా ప్రజాశాంతి జెండా ఉంది. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్‌ రెక్కలు కచ్చితంగా  వైఎస్సార్‌సీపీ  ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ మాదిరిగా కనిపిస్తోంది. ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలో 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలిపింది. వారిలో 38 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న వారి పేర్లు అదే స్థానాల నుంచి బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇక ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులందరూ పూర్తిగా ఎస్సీ ఓటర్లపైనే దృష్టిపెట్టారు. వైఎస్సార్‌సీపీకి తొలినుంచీ దన్నుగా ఉన్న ఎస్సీ ఓట్లను చీల్చేందుకే టీడీపీ అధినేత ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్టు పరిశీలకులు తప్పుబడుతున్నారు. 

ఓటర్లను అయోమయానికి గురిచేసే కుట్రలు..
వైఎస్సార్‌సీపీకి ఉన్న ఓటు బ్యాంకును చీల్చి లాభపడాలనుకునే టీడీపీ కుట్రలకు తానా తందానా అంటున్న ప్రజాశాంతి పార్టీ ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా ఎస్సీ ఓట్లపైనే పాల్‌ పార్టీ దృష్టి పెట్టింది. దీనికితోడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ట్వీట్‌ చేసినట్టుగా మన గుర్తు హెలికాప్టర్‌ అని, మన ఫ్యాన్‌ గుర్తు పాల్‌ పార్టీకి, పాల్‌ హెలికాప్టర్‌ గుర్తు మన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిందనే తప్పుడు పోస్టులతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అనే తప్పుడు ఫేస్‌బుక్‌ అక్కౌంట్లతో ‘జగన్‌ సీఎం కావాలంటే హెలికాప్టర్‌ గుర్తుకు ఓటెయ్యాలని’ పోస్టులు పెడుతున్న తీరును గమనిస్తే ఒక పథకం ప్రకారమే వైఎస్సార్‌సీపీ ఓట్లను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం నిర్ధారణ అవుతోంది.

ఈ కేసుల నుంచే పాల్‌ను గట్టెక్కిస్తామని హామీ ఇచ్చారు..
కేఏ పాల్‌ సోదరుడు డేవిడ్‌రాజు 2010 జనవరి 31న హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గమ్‌ సొసైటీకి చెందిన రూ.వందల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి డేవిడ్‌రాజు, పాల్‌కు మధ్య వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సోదరుడి హత్యకు పాల్‌ కుట్ర చేశారనే అభియోగంపై అప్పట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా అద్దకల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ 10/2010లో 120(బి), 302, 379, 404, 201, రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్లపై కేసులో అరెస్టు అయిన పాల్‌ బెయిల్‌పై ఉన్నారు. కాగా డేవిడ్‌రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోటేశ్వరరావు పాల్‌కు ప్రధాన అనుచరుడు. అయితే తదుపరి కోటేశ్వరరావును అపహరించి హత్య చేయడానికి 2012లో ప్రకాశం జిల్లా ఒంగోలు సీఐకి పాల్‌ కోటి రూపాయలు లంచమిచ్చే ప్రయత్నం చేశారు. ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసిన పోలీసులు కట్టుదిట్టమైన ఆధారాలతో పాల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో పాల్‌పై 2012లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 229/2012 నమోదైంది. అండర్‌ సెక్షన్‌ 116, 120(బి), 307, రెడ్‌ విత్‌ 109 ఐపీసీతోపాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 12 కింద కేసు పెట్టారు. ఎన్నికల్లో తనకు సహకరిస్తే ఈ రెండు కేసులతో పాటు మహబూబ్‌నగర్‌ కేసు నుంచి గట్టెక్కిస్తామని పాల్‌కు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.  
 

మరిన్ని వార్తలు