కడప జిల్లా ముఖచిత్రం

23 Mar, 2019 11:35 IST|Sakshi
కడప

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప 1807లోనే జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,61,539 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1,79,666 మంది పురుషులు, 1,81,873 మంది మహిళలు ఉన్నారు. ఓటర్ల విషయానికి వస్తే 116248 మంది పురుషులు, 120884 మంది మహిళలు, వంద మంది ఇతరులు కలిపి మొత్తం 2,37,232 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 273 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

గతాన్ని ఓమారు విశ్లేషిస్తే...
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కె.కోటిరెడ్డి 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయనకు 13742 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్‌ అభ్యర్థి అయిన పుల్లగూర శేషయ్యశ్రేష్టికి 13702 ఓట్లు లభించాయి. కేవలం 40 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1955లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోటిరెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి నాళ్లలో కడప మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన రహమతుల్లా 1955 ఎన్నికల్లో, ఆ తర్వాత 1967 ఎన్నికల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. అప్పటి ప్రధాని నెహ్రూ కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కుమారుడు అయిన అహ్మదుల్లా మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2004, 2009లో ఆయన కడప ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలుపొందారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అహ్మదుల్లాకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పదవి లభించింది. ఇటీవల ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి కుటుంబాన్ని ‘కాల్‌టాక్స్‌’ వారుగా ప్రజలు పిలుస్తుంటారు. 

గజ్జెల రంగారెడ్డి
1972, 1978లలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పార్టీ తరుపున 1989లో కందుల శివానందరెడ్డి ఓమారు గెలుపొందారు. ఆయన తండ్రి కందుల ఓబుల్‌రెడ్డి రెండు పర్యాయాలు కడప లోక్‌సభ సభ్యునిగా పనిచేశారు.శివానందరెడ్డి ఓమారు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రాజకీయ పరిణామాల్లో ఆయన టీడీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేదని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీ తరుపున గెలుపొందిన ఎస్‌.రామమునిరెడ్డి, సి.రామచంద్రయ్య, డాక్టర్‌ ఎస్‌ఏ ఖలీల్‌బాషా ముగ్గురు కలిపి నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

వీరు ముగ్గురికి మంత్రి పదవులు లభించడం గమనార్హం. ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో రామమునిరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, సి.రామచంద్రయ్య ఇరవై సూత్రాల అమలుశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్‌గా సేవలు అందించారు. చంద్రబాబు హయాంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆ తర్వాత చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ తరుపున మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక ఖలీల్‌బాషా చంద్రబాబు క్యాబినెట్‌లో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి కడప లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి వెళ్లారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అంజద్‌బాషా 45,205 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌ పోటీ చేశారు. పొత్తు ఖరారు కావడానికి ముందే ఆయనకు బి.ఫారం ఇవ్వడంతో పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆ తర్వాత విరమించుకోవడానికి నిరాకరించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ అల్లపురెడ్డి హరినాథరెడ్డికి కేవలం 5350 ఓట్లు మాత్రమే రావడంతో ధరావత్తు కోల్పోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున లోక్‌సభకు పోటీ చేసిన వైఎస్‌ అవినాష్‌రెడ్డికి కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 42,508 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ ఎన్నికల్లో 450 ఓట్లు నోటాకు వచ్చాయి.  

మరిన్ని వార్తలు