కొలిక్కి రాని కనిగిరి రచ్చ

27 Feb, 2019 13:41 IST|Sakshi

ఎమ్మెల్యే బాబూరావు, ఉగ్రతో సీఎం చర్చలు

తనకే ఎమ్మెల్యే టికెట్‌ కావాలన్న బాబూరావు

ఉగ్రకు ఎమ్మెల్సీ అంటూ ప్రతిపాదన

నిర్ణయం తాను ప్రకటిస్తానన్న సీఎం

చిందులు తొక్కిన బాబూరావు..బాలకృష్ణకు ఫోన్‌

సీఎంతో మాట్లాడిన బాలకృష్ణ

ఉగ్రకు ఎంపీ టికెట్‌ ప్రతిపాదన..?

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కనిగిరి టికెట్‌ తనకే కావాలంటూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పట్టుబట్టారు. ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వమంటూ  ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదన పెట్టారు. నిర్ణయం తాను ప్రకటిస్తాన్న  సీఎం మాటను బాబూరావు పెడచెవిన పెట్టారు. సమావేశం నుంచి అలిగి బయటకు వచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుంటే పార్టీ వదలి వెళతానంటూ చిందులు తొక్కారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు  ఫోన్‌ కొట్టాడు. వెంటనే  బాలకృష్ణ సీఎం కు ఫోన్‌ చేసి తాను కలవడానికి వస్తున్నానంటూ సమాచారం పంపారు. బాలకృష్ణ ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చే పక్షంలో  ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని  ముఖ్యమంత్రి ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అమరావతి వేదికగా  ఈ రచ్చ సాగింది. వివరాల్లోకి వెళితే... సోమవారం ప్రారంభమైన టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ సమీక్ష సామావేశానికి కొనసాగింపుగా మంగళవారం  అమరావతిలో సీఎం కనిగిరి నేతలతో సమావేశం నిర్వహించారు.

మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిలతో సమావేశమయ్యారు. ప్రారంభంలో ఇద్దరు నేతలు మీ నిర్ణయానికే కట్టుబడిఉంటామంటూ సీఎంకు హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆ మేరకు ఇద్దరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇంతలో తనకు ఎమ్మెల్యే టికెట్‌ కావాలని ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కదిరి బాబూరావు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇప్పుడే తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఇంతలోనే మాట మారిస్తే ఎలా అని సీఎం కదిరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  అన్ని రకాలుగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆ నిర్ణయానికే ఇద్దరూ కట్టుబడి ఉండాలని సీఎం ఖరాఖండిగా చెప్పారు. సీఎం వాలకం చూసి కనిగిరి టికెట్‌ ఇవ్వడన్న అనుమానంతో కదిరి వేగంగా స్పందించారు.

తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ  సీఎం సమావేశం నుండి విసురుగా బయటకు వచ్చారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ల ముందే పార్టీని, నేతలను తిడుతూ చిందులు తొక్కారు. పార్టీ అధిష్టానం పైనా దూషణలకు దిగారు. టికెట్‌ ఇవ్వకపోతే ఈ పార్టీ అక్కరలేదంటూ విరుచుకుపడ్డారు. అక్కడి నుంచే చంద్రబాబు వియ్యంకుడు  బాలకృష్ణకు ఫోన్‌ చేశారు. వెంటనే బాలకృష్ణ సీఎంకు ఫోన్‌చేశారు.  మీతే మాట్లాడేందుకు అమరావతికి వస్తున్నానంటూ బాలకృష్ణ  సీఎంకు వర్తమానం పంపారు. బాబూరావుకే టికెట్‌ ఇవ్వాలని బాలకృష్ణ ఒత్తిడి తెచ్చే పక్షంలో  ఉగ్రనరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా  నిలిపితే ఎలా ఉంటుందని సీఎం జిల్లా టీడీపీ నేతలతో అప్పటికప్పుడే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో  బాలకృష్ణ ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది..? అందుకు సీఎం లొంగుతారా..? అదే జరిగితే కనిగిరి టికెట్‌ బాబూరావుకేనా..? ఉగ్ర  ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీకి అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు