వైఎస్సార్‌సీపీలో భారీ ఎత్తున చేరికలు

11 Mar, 2020 03:21 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఏపీ సీఎం జగన్‌

పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు

విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు బాలరాజు, తైనాల, చింతలపూడి

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు.. టీడీపీ, జనసేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివిధ జిల్లాల్లో ఆ పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు అధికార వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు. 

మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల, చింతలపూడి చేరిక
విశాఖ నగరంలో మంగళవారం మాజీ మంత్రి బాలరాజు (జనసేన), మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌ (టీడీపీ), చింతలపూడి వెంకట్రామయ్య (జనసేన), బాలరాజు కుమార్తె దర్శిని, కుమారుడు భగత్, టీడీపీ నగర వైస్‌ ప్రెసిడెంట్‌ గుడ్ల సత్యారెడ్డి దంపతులు, పి.వి. సురేశ్‌ (జనసేన), వుడా మాజీ డైరెక్టర్‌ కోరిబిల్లి సురే‹శ్, కొణతాల సుధ, లయన్స్‌ క్లబ్‌ చైర్‌పర్సన్‌ నిఖిత, తోట రాజీవ్‌ (టీడీపీ), ఉషశ్రీ (జనసేన)తోపాటు వందలాది మంది టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు