ఘన్‌పూర్‌ నీది కాదు.. మనది!

12 Oct, 2018 01:07 IST|Sakshi

ఇక నాది అనే మాట మాట్లాడొద్దు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజయ్యకు కడియం హితబోధ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘రాజయ్య ఇప్పుడు కూడా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నాది అంటున్నారు. ఆ మాట మాట్లాడొద్దు. ఇది నీ నియోజక వర్గం కాదు. ఇది మన నియోజక వర్గం. మీకు 52 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. నేను పోటీ చేసినప్పుడు 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను’ అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటికొండ రాజయ్యనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పార్టీ అసమ్మతి నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు గురువారం సమన్వయ కమిటీ సమావేశం అయింది.

వరంగల్‌లోని ఓ హోటల్‌లో కడియం, టి.రాజయ్య, ఉమ్మడి వరం గల్‌ జిల్లా పరిశీలకులు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండా ప్రకాష్, సీతారాంనాయక్, పసునూ రి దయాకర్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో పార్టీ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడారు.

ఎదుటివారిని చులకన చేసి మాట్లాడొద్దని, ఎక్కడ ఎవరి వల్ల పని అవుతుందో, వారితో ఆ పని చేసుకుంటేనే ఫలితం వస్తుందని రాజయ్యను ఉద్దేశించి అన్నారు. రాజయ్య కు కూడా తమ్మునిగా భావించి సలహా ఇస్తున్నానంటూ.. నీ వెంట ఉన్నవాళ్లు, నువ్వు గెలువాలని కోరుకుంటున్న వాళ్లు, పక్కన ఉన్నవాళ్లని అవమాన పర్చే విధంగా వెకిలిగా నవ్వొద్దని సూచించారు. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ ఒక్క నియోజకవర్గంలో ఫలితాలు తారుమారు అయినా నష్టపోయేది టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అని గుర్తు పెట్టుకుని పనిచేయాలని ఆయన కార్యకర్తలను హితబోధ చేశారు.

మరిన్ని వార్తలు