‘చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు’

27 Apr, 2019 13:47 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోనున్నారని, అందుకే చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. సమీక్షలు చేయాలని ఉవ్విల్లూరుతూ.. ఎన్నికల సంఘానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారన్నారు. ఏమైనా అంటే ప్రధాని మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పోల్చుతున్నారని మండిపడ్డారు. దేశానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రధానికి ఉందని, కేసీఆర్‌ ప్రజలతో ఎన్నుకోబడ్డారని అన్నారు.

చంద్రబాబు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి తాను కూడా సమీక్ష పెడతానంటున్నారని తెలిపారు. ధాన్యం విక్రయాలు జరుగుతుండటంతో మామూళ్ల కోసమే సోమిరెడ్డి సమీక్ష నిర్వహిస్తామని అంటున్నారని చెప్పారు. అవినీతి పరుడుగా పేరొందిన సోమిరెడ్డి ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడిన సోమిరెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు  ఓడించనున్నారని జోష్యం చెప్పారు.

మరిన్ని వార్తలు