తాగునీటితోనూ సోమిరెడ్డి రాజకీయం

11 Jul, 2018 12:20 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

బోరు వేయిస్తే పూడ్చమని ఒత్తిడి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  

పొదలకూరు: ప్రజలకు దూరం అవుతున్న సోమిరెడ్డి ఎలాగైనా ఓట్లు సంపాదించుకోవాలని తాగునీటితోనూ రాజకీయ లబ్ధిపొందేందుకు చూస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణ తాగునీటి అవసరాలకు చెరువుకు సమీపంలో వేసిన బోరును మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణానికి తాగునీరు అందకుంటే అధికార టీడీపీ ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి రాజకీయంగా లబ్ధిపొందే నీచస్థాయికి మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారినట్టు తెలిపారు.

చెరువుకు సమీపంలో వేసిన బోరులో అదృష్టం కొద్ది పుష్కలంగా నీరుపడ్డాయని, అయితే మంత్రి ఎండోమెంట్‌ అధికారులకు ఫోన్‌చేసి వెంటనే బోరును పూడ్చివేయించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఓట్లు సాధించే పద్ధతి ఇదేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మరో 20 రోజుల్లో సర్పంచ్‌ నిర్మలమ్మ పదవీకాలం పూర్తి అవుతుందని, అయితే ఆమె తన పదవీకాలం చివరిరోజుల్లో సైతం తాగునీటిని అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అధికారపార్టీ నాయకులు మాత్రం అటు కండలేరు సీపీడబ్ల్యూ స్కీమ్‌ నుంచి ఇటు కొత్తగా వేసిన బోర్ల నుంచి నీరు అందకుండా చేసి తామేదో ప్రజల కోసం ట్యాంకర్లను తిప్పుతున్నట్టు భ్రమింపజేయాలని చూస్తున్నారని వెల్లడించారు.  

ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ర్యాలీ సిగ్గుచేటు
అధికార పక్షంలో ఉండటమే కాక మంత్రి పదవి వెలగబెడుతున్న నాయకుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వెంకటాచలంలో అరువుకు తెచ్చుకున్న నాయకుల ద్వారా ర్యాలీ చేయించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కాకాణి ధ్వజమెత్తారు. ఈ ఘటనను చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి బలమెంతో తెలిసిపోతుందన్నారు. స్థానికంగా జనం లేక బయటి నుంచి రప్పించి తనపై బ్యానర్లతో ర్యాలీ చేయించినట్టు పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడైనా, ఎక్కడైనా చూసి ఉంటామా అని ప్రశ్నించారు. నిధులు దిగమింగేందుకే మంత్రి కొడుకును సమన్వయకర్తగా ఏర్పాటు చేశారన్నారు. నియోజకవర్గానికి సమన్వయకర్త కాదని, కాంట్రాక్టర్లు, అధికారులకు మాత్రమే కుమారుడు సమన్వయకర్తన్నారు. తనమీదకు సోమిరెడ్డి ఎంతమందిని పంపినా తానొక్కడినే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

అధికారులను నిబంధనల ప్రకారం పనిచేయమంటే మంత్రి ఆందోళన చెందుతున్నట్టు ఆరోపించారు. ఉద్యోగ, బీసీ సంఘాలను రెచ్చగొట్టి తనమీదకు ఉసిగొల్పాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అన్యాయంపై రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్‌ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు కండే సులోచన, ఎస్‌కే అంజాద్, గార్ల పెంచలయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, జిల్లా యూత్‌ విభాగం ప్రధానకార్యదర్శి పి.అశోక్‌కుమార్‌రెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి, పలుకూరు పోలిరెడ్డి, ఎం.వెంకటరామిరెడ్డి, ఎం.శేఖర్‌బాబు, వార్డుసభ్యులు మూలి సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌కే మస్తాన్, రత్నారెడ్డి, చెన్నారెడ్డి వెంకురెడ్డి, టి.సిద్దయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు