జన సైనికులూ...పవన్‌ నైజాన్ని గుర్తించండి

13 Jan, 2020 13:00 IST|Sakshi
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి. చిత్రంలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు

‘బాబు’పై ప్రజల మనోభావాలనే చెప్పా

పవన్‌ ఇప్పటికీ ‘బాబు’ తొత్తే

ఆ పార్టీ కేడర్‌ ఇప్పటికైనా వాస్తవం గుర్తించాలి

కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి

కాకినాడ: రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ప్రజల మనోభావాలనే శనివారం నాటి మూడు రాజధానుల సంఘీభావ ర్యాలీలో తాను తెలిపానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ను నానా దుర్భాషలాడుతూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూనే స్వయంగా చంద్రబాబు, ఆయన భజనపరులు అసభ్యకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. తన  నివాసంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల కోసం మూడు రాజధానుల ప్రతిపాదన ఆసరాగా ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఎలా సమర్థించారో ప్రజలకు తెలియంది కాదన్నారు.  

కులం రంగు పులమొద్దు
పవన్‌పై తాను రాజకీయ విమర్శలు చేస్తే కాపు కులస్తులపై చేశానంటూ ఆ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జనసేన నాయకుడు పంతం నానాజీ కాకినాడ సిటీ, రూరల్‌లో పోటీ చేసి ఏ స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నారో? ఆ సామాజిక వర్గంలో అతని బలమేమిటో అందరికీ తెలుసన్నారు. బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్‌రంగా జిల్లాలో తొలిసారి అడుగు పెట్టిన దగ్గర నుంచి  విద్యార్థి నాయకుడిగా తాను కాపు సామాజికవర్గంతో సాన్నిహిత్యంగా, జక్కంపూడి శిష్యునిగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనను సవాల్‌ చేసే స్థాయి నానాజీకి లేదన్నారు. తనకు ఉన్న స్నేహితులు, పార్టీ కేడర్‌లో అత్యధికులు కాపుకులస్తులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కులం పేరుతో ఇంతగా రాజకీయాలు చేస్తున్న జనసేన.. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు, కుమారులను చంద్రబాబు సర్కార్‌ అవమానకరంగా వేధింపులకు గురిచేసినప్పుడు ఎందుకు పత్తాలేకుండా పోయిందన్నారు.

తమ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి విజయలక్ష్మి వంటి వారంతా ముద్రగడను పరామర్శిస్తే టీడీపీ, జనసేన నాయకులు ఏమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుని సంఘటనలో ఉన్న కేసులన్నింటినీ సీఎం జగన్‌ ఎత్తివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును వదిలి తనకుతానుగా రాజకీయాలు చేసి జగన్‌లా ప్రజల్లో తిరిగితే భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. వైఎస్సార్‌ సీపీ సిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రశాంత కాకినాడ నగరంలోఅలజడులు సృష్టించేందుకు పంతం నానాజీప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా నైతిక విలువలు లేని, కాపుల్లో పట్టులేని నానాజీకి చంద్రశేఖరరెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ నగర మహిళాధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జన సైనికులూ...పవన్‌ నైజాన్ని గుర్తించండి
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ఆ పార్టీ కేడర్‌ గుర్తించాలని చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు చెప్పినట్టే ఆడుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబుతో కలిసి పోటీ చేసి ఆ తరువాత మూడున్నరేళ్లు పత్తాలేకుండా పోయినమాట వాస్తవం కాదా? అని నిలదీశారు. గత ఎన్నికల ప్రచార సభల్లో సైతం అప్పటి అధికార టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకుండా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే లక్ష్యంగా పవన్‌ ఆరోపణలు చేయడానికి చంద్రబాబుతో కుమ్మక్కవ్వడం కాదా అని నిలదీశారు. రాజధాని వివాదంలోను, ఉద్దానం సమస్యపై అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ పర్యటన తెలుసుకుని చంద్రబాబు డైరెక్షన్‌లో రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతాలను పవన్‌ సందర్శించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు