ఏ ముఖంతో ఓట్లడుగుతున్నారు?

25 Sep, 2017 01:46 IST|Sakshi

ఏఐటీయూసీకి ఓటేస్తే వారసత్వ ఉద్యోగాలు వస్తాయా: ఎంపీ కవిత

సాక్షి, హైదరాబాద్‌: ఏఐటీయూసీకి ఓటేస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వస్తాయా అని ఎంపీ, టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కె.కవిత ప్రశ్నించారు. ఏఐటీయూసీ గెలిచినా, ఓడినా ఉద్యోగాలు ఇప్పించలేరని, వారి మాటలతో మోసపోవద్దని కోరారు. ఆదివారమిక్కడ పలువురు టీఎన్‌టీయూసీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ‘‘వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన ఏఐటీయూసీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.

వారసత్వ ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వాగ్దానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇదంతా గిట్టని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నేతలు మాయమాటలు చెప్పి కొందరితో కోర్టులో కేసు వేయించారు. సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుస్తుందన్న భయంతోనే బద్ధ విరోధులైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు కూటమిగా ఏర్పడ్డాయి’’అని అన్నారు. 18 ఏళ్ల కింద అప్పటి సీఎం చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయ ఒప్పందంపై ఏఐటీయూసీ సంతకం పెట్టింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు.

ఆ ద్రోహాన్ని కార్మికులు ఎలా మరచిపోతారని అన్నారు. కొత్తగా 5,600 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. వీఆర్‌ఎస్‌లో డబ్బు తీసుకోని వారికి బదిలీ వర్కర్లుగా అవకాశం కల్పించిన విషయం కార్మికులకు తెలుసునన్నారు. తెలంగాణను సాధించుకున్నట్టే డిపెండెంట్‌ ఉద్యో గాలను కూడా టీబీజీకేఎస్‌ సాధిస్తుందని స్పష్టంచేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు